Tomato Price Falls: గత కొంత కాలంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసిన 100 నుంచి 300 వరకు పలకాయి. దీంతో చాలా మంది రైతులు కోటీశ్వరులు కాగా.. సామాన్య ప్రజలు మాత్రం టమాటాలు కొనడమే మానేశారు. పప్పు, చారు, సాంబార్లతోనే సరిపెట్టుకున్నారు. అయితే తాజాగా తగ్గుతున్న టమాటా ధరలతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. టమాటా ధరలు భారీగా పెరగడంతో మదనపల్లికి చెందిన చాలా మంది రైతులు టమాటా సాగు చేశారు. విపరీతంగా దిగుబడి కూడా వచ్చింది. కానీ దీని వల్ల టమాటా ధర పడిపోయింది. పది రోజుల క్రితం కిలో టమాటా 196 రూపాయలు ఉండగా... శుక్రవారం రోజు రూ.36కు పడిపోయింది. పక్క జిల్లాలో ఇత ప్రాంతాల్లో టమాటా దిగుబడి పెరగడం.. మార్కెట్ లో బయ్యర్లు రాకపోవడంతో డిమాండ్ తగ్గింది. గిరాకీ తగ్గిన టమాటా మార్కెట్ లో ధర లేక పతనం వైపు పయనిస్తోంది. ఇతర ప్రాంతాల్లో టమాటా దిగుబడి రావడం, బయ్యర్ల నుంచి పోటీ లేకపోవడమే ధర తగ్గుముఖం పట్టడానికి కారణం అని తెలుస్తోంది. 


మదనపల్లి మార్కెట్ లో మూడు రోజులుగా మళ్లీ అమాంతంగా పడిపోతున్న ధరతో పతనం వైపు పయనిస్తోంది. గత నెల 29, 30వ తేదీల్లో ఏకంగా డబుల్ సెంచరీకి చేరువైన టమాట ఇప్పుడు కనిష్ఠ ధర రూ.36కు పడిపోయింది. ఈనెల 4వ తేదీన కిలో టమాటా గరిష్ఠ ధర రూ.136 కాగా, కనిష్ఠ ధర రూ.100 పలికింది. మొత్తం 399 మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లె మార్కెట్ కు వచ్చింది. 5వ తేదీన కిలో టమాటా గరిష్ఠ ధర రూ.100, కనిష్ఠ ధర రూ.76కు చేరుకుంది. ఆరోజు 195 మెట్రిక్ టన్నుల టమాటా మార్కెట్ కు వచ్చింది. 6వ తేదీన గరిష్ఠ ధర రూ.116 కాగా, కనిష్ఠ ధర రూ.90గా ఉంది. ఆరోజు ఏకంగా 404 మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లె మార్కెట్ కు అమ్మకానికి వచ్చింది. ఇక 7వ తేదీన కిలో ధర గరిష్ఠంగా రూ.112 కాగా, కనిష్ఠ ధర రూ.88 గా ఉంది. ఆరోగు 299 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 


ఇక 8వ తేదీన టమాటా గరిష్ఠ ధర రూ.128 కాగా, కనిష్ట ధర రూ.91లుగా ఉండగా... 258 మెట్రిక్ టన్నుల టమాటా మార్కెట్ వచ్చింది. 9వ తేదీన గరిష్ ధర రూ.104 కాగా కనిష్ట ధర రూ.80లకు పడిపోయింది. ఆరోజు ఏకంగా 351 మెట్రిక్ టన్నుల టమాటా మార్కెట్ కు వచ్చింది. 10వ తేదీన అయితే అమాంతం టమాటా ఘరలు పడిపోయాయి. గరిష్ఠ ధర రూ.64 కాగా కనిష్టంగా రూ.36కే చేరింది. శుక్రవారం ఆరోజు 396 మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లె మార్కెట్ కు రావడం, బయ్యర్లు లేక టమాటాకు గిరాకీ తగ్గింది. ఇలా నిన్నటి నుంచి ధర తగ్గుతూ వస్తోంది. 


టమాటా సాగు చేసి కాస్తో కూస్తో కూడబెట్టుకోవాలనుకున్న అన్నదాతలకు నిరాశే మిగిలింది. రోజురోజుకూ టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో పెద్ద మొత్తంలో సాగు చేశామని.. దిగుబడి కూడా బాగా వస్తుండగా.. ధరలు తగ్గడం చాలా బాధాకరం అని చెబుతున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా కూరగాయలు, ముఖ్యంగా టమాటా ధర పెరగడంతో పప్పులకే పరిమితం అయ్యామని చెబుతున్నారు. టమాటా ధర తగ్గితే ఇకపై అయినా కూరగాయలు వండుకోవచ్చని వివరిస్తున్నారు. 


Read Also: Tomoto Rates : అందుబాటులోకి వచ్చిన టమాటా - కేజీ ఇంత తక్కువా !?