పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించిందని ప్రకటన విడుదల చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచిందన్నారు. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసిందని వివరించారు. 


తెలంగాణకు ఇది చారిత్రక విజయం : సీఎం కేసీఆర్‌


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. పథకం తొలిదశ పనులు తుదిదశకు చేరుకొన్న వేళ పర్యావరణ అనుమతులు లభించడంపై తెలంగాణ విజయం అన్నారు. ఈ అనుమతులు కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండో దశ పనులు చకచకా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందన్నారు. ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి అనుమతులు సాధించామని గుర్తు చేశారు. ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు. 


ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకొన్నదని తెలిపారు కేసీఆర్. ఇది తెలంగాణ సర్కారు సంకల్పానికి నిలువెత్తు నిదర్శమని పేర్కొన్నారు. కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు ఆసన్నమైనదని తెలిపారు. పాలమూరుకు పర్యావరణ అనుమతుల సాధనకు కృషి చేసిన సాగునీటిశాఖ ఇంజినీరింగ్‌ అధికారులను అభినందించారు.






కుట్రలను ఛేదించి- కేసులను అధిగమించి
ప్రాజెక్టుకు అనుమతులు లభించడంపై ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగు పరుగున రానుందని ట్వీట్ చేశారు. "పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించ‌డం ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు సాధించిన మరో అపూర్వ, చారిత్రాత్మక విజ‌యం. ఆయ‌న మొక్కవోని దీక్షకు.. ప్ర‌భుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడై సాధించిన ఫ‌లితమిది." అని వివరించారు. 


" పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భం. మాట‌ల్లో వ‌ర్ణించ‌లేని మ‌ధుర ఘ‌ట్టం. పాల‌మూరు బీళ్ల దాహార్తిని తీర్చే ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావ‌డం అపూర్వ ఆనందాన్ని ఇస్తున్న‌ది." అని సంతోషం తెలియజేశారు.