Janasena Chief Pawan Kalyan: జనసేన నాయకుడు కొట్టే సాయిని సీఐ కొట్టిన విషయమై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిర్యాదు చేశారని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్ధాయిలో విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు పేర్కొన్నారు. సీఐ ప్రవర్తనపై ఉన్నత స్ధాయి అధికారితో విచారణ జరిపిస్తామన్నారు. అలాగే ఉన్నత స్ధాయి అధికారుల నివేదిక ప్రకారం శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో అంజూ యాదవ్ పై ఉన్న ఆరోపణలు, వీడియోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియా వైరల్ గా మారాయని చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ఘటనలో మాత్రం అంజూ యాదవ్ తో పాటు కొట్టే సాయిని కూడా విచారస్తామని అన్నారు. కేవలం అంజూ యాదవ్ ప్రవర్తన తీరుపై మాత్రమే పవన్ కల్యాణ్ తనతో ప్రస్తావించినట్లు వివరించారు. పొలిటికల్ సీజన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారన్నారు. జిల్లాలో 23 జూన్ వరకు మొత్తం 2,123 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని.. అందులో 94 కేసులు ట్రేస్ కాలేదని స్పష్టం చేశారు. వీటిలో వాలంటీర్లు ప్రమేయం లేదని తేలిందని వివరించారు.
ఈరోజే భారీ ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేసిన పవన్ కల్యాణ్
జనసేనపార్టీ కార్యకర్త కొట్టే సాయి పట్ల శ్రీకాళహస్తి సీఐ అమానుష వ్యవహార శైలిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డిని కోరారు. పవన్ కళ్యాణ్ పిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాంమని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఎస్పీ కార్యాలయం వద్ద అభిమానుల మధ్య తోపులాట జరుగగా.. పవన్ కల్యామ్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.