Tirupati News: తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో మరోసారి ప్రైవేటు అంబులెన్స్ మాఫియా రెచ్చి పోయింది. గత రెండు రోజుల‌ క్రితం ఆనారోగ్యంపాలైన రేణిగుంటకు చేందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో‌ చికిత్స చేయించారు. ఆయన పరిస్థితి విషమించడంతో పక్కనే ఉన్న సిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఇలా తరలించేందుకు కూడా అంబులెన్స్‌ డ్రైవర్స్‌ భారీగా డిమాండ్ చేశారు. ఈ టైంలో ఆ రోగి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రేణిగుంటకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్‌లు భారీగా డబ్బులు అడిగారు. అయితే బయట వాహనాన్ని మాట్లాడుకున్నారు. దీంతో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు వాహనాన్ని అడ్డుకొని నానా రభసా చేశారు. బయటి వాహన డ్రైవర్ పై దాడికి దిగారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


అంత స్థోమత లేదని చెప్పినా కనికరించని డ్రైవర్లు..!


వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మరోసారి అంబులెన్స్ మాఫియా రెచ్చిపోయింది. శనివారం ఉదయం రేణిగుంటకు చెందిన ఓ వ్యక్తికి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండగా రుయాకి తరలించారు. అయితే తీవ్ర  అనారోగ్యానికి గురైన వ్యక్తి పరిస్ధితి అత్యంత విషమంగా ఉండడంతో రుయా ఆసుపత్రి నుండి పక్కనే ఉన్న సిమ్స్ ఆసుపత్రికి తరలించమని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ డ్రైవర్లతో మాట్లాడగా.. 800 రూపాయలు అడిగారు. అయితే ఈ క్రమంలోనే రోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి మృతదేహాన్ని తిరిగి రేణిగుంటకు తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ మాట్లాడారు. 3 వేల రూపాయలు ఇస్తేనే మృతదేహాన్ని తరలిస్తామని చెప్పగా.. మృతుడి బంధువులు తమకు అంత స్థోమత లేదని తెలిపారు. అయినా వాళ్లు కనికరించలేదు. అడిగినంత ఇస్తేనే వస్తామని తెగేసి చెప్పారు. 


శ్రీవాసులపై దాడికి దిగిన పది మంది అంబులెన్స్ డ్రైవర్లు..


దీంతో చేసేదేం లేక బయట వేరే వాహనాన్ని మాట్లాడుకుంటామని వెళ్లి 800 రూపాయలకే ఓ వాహనాన్ని తెచ్చుకున్నారు. అందులో మృతదేహాన్ని ఎక్కించుకొని ఇంటికి ప్రయాణం అయ్యారు. అయితే విషయాన్ని గుర్తించిన రుయా ఆస్పత్రి ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు.. మృతదేహాన్నితరలించేందుకు వచ్చిన డ్రైవర్ శ్రీనివాసులుతో వాగ్వాదానికి దిగారు. మృతుడి బంధువులు పిలిస్తేనే తాము వచ్చినట్లు చెప్పినా వినకుండా అతడితో గొడవ పడ్డారు. దాదాపు పది మంది ఒకేసారి అతడిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ... దాడి చేసేందుకు యత్నించారు. అయితే అదే సమయంలో ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన మృతుడి‌ బంధువులు రుయా ఆసుపత్రిలోని ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లతో గొడవకు దిగారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రుయా ఆసుపత్రిలోని ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు సద్దుమణిగారు.


వాళ్లు చేసే ఆగడాలు ఎక్కువవుతుండటంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలోనే రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు వెలుగు చూడటం పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కేసులు నమోదు చేయడం జరిగాయి. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. రుయా ఆసుపత్రిలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలకు హద్దు లేకుండా పోతుండడంపై రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనిపై జిల్లా అధికార యంత్రం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.