Laxmi Parvati Comments: ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్‌ లక్ష్మీ పార్వతి అన్నారు. పూర్తి పగ్గాలు తీసుకొని ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ లాగా ప్రజలతో జూనియర్ ఎన్టీఆర్ మమేకం అవ్వాలని సూచించారు. అలా అయితేనే టీడీపీ గెలిచే అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు పోలీసులంతా చంద్రబాబు చేతిలోనే ఉన్నారని... అప్పుడు కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజకీయంగా ఇరికించే ప్రయత్నం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. సీబీఐలోనూ అతని మనుషులు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వచ్చినా వీఆర్ఎస్ కావడమే అంటూ వ్యాఖ్యానించారు. ప్రజాకర్షణ లేని వాళ్లే చంద్రబాబు లాగా పొత్తులు పెట్టుకుంటారని తెలిపారు. క్యాన్సర్ డే సందర్భంగా ఒమేగా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నట్లు లక్ష్మీ పార్వతి తెలిపారు. జనరల్ చెకప్ కోసం వచ్చానని వివరించారు. క్యాన్సర్ కి ఎవరూ భయపడవద్దని సూచించారు. 


ఇటీవల ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కామెంట్లు


జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి కొన్ని రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ‌సిద్ధంగా లేరని తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ‌ పార్వతీ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత బాగుందో, టీటీడీ నిర్వహణ కూడా అదే విధంగా ఉందన్నారు లక్ష్మీ పార్వతి. రాజు మంచి వాడైతే మిగిలిన వాళ్లు కూడా బాగా పని చేస్తారు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనే కారణమన్నారు. రాబోవు ఎన్నికల్లో తిరిగి‌ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని దేవుడు ఎప్పుడో నిర్ణయించారని, ఎవరూ ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఎదిరించలేరన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలంతా ఆయన వెంట ఉన్నారని చెప్పిన ఆమె, జగన్మోహన్ రెడ్డికి ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలియజేశారు. ఎన్నికల ముందు టీడీపీ వాళ్లు అబద్ధాలు సృష్టిస్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం‌ లేదని, నారా లోకేశ్ నాయకత్వాన్ని సమర్ధించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా‌ లేరన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి‌ పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలోకి వస్తారని లక్ష్మీ పార్వతీ అన్నారు. 


పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ 


జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తరచూ వార్తలు వస్తుంటాయి. అటు వైసీపీ నేతలతో పాటు టీడీపీ నేతలు ఈ విషయంలో స్పందిస్తుంటారు. టీడీపీకి గతంలో ప్రచారం చేసిన జూ.ఎన్టీఆర్ ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి ఏపీలో రాజకీయాలు కీలకంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా కావాల్సినప్పుడు టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని ఇటీవల తారకరత్న అన్నారు.  అయితే జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వైసీపీ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే జూ.ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. వచ్చే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకుంటారని, చంద్రబాబు మరో పార్టీ పెట్టుకుంటారని కూడా చెప్పారు.  2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తాయన్నారు.