Nara Lokesh Padayatra: నాడు పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, నేడు అధికారంలోకి వచ్చాక పన్నులు వేసి ప్రజలను పిడి గుద్దులు గుద్దుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలోనే కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ కు జనం నీరాజనం పట్టారు. ఆడపడుచులు హారతి పల్లాలతో వచ్చి పూల మాలలు వేశారు. అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం తవణం పల్లి విడిది కేంద్రంలో గాండ్ల సామాజిక వర్గీయులతో సమావేశం అయ్యారు. కష్టజీవులు అయిన గాండ్ల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి గాండ్ల కులస్తులు సహకారం అందించాలని కోరారు. 






సీఎం జగన్ బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని, ప్రజలని చూస్తే భయపడుతున్నాడని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సీబీఐని చూస్తే మరింత భయపడుతున్నాడని, బాబాయిని చంపింది అబ్బాయేనని అన్నారు. యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి సైకిల్ రావాలంటూ వ్యాఖ్యానించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు. నాడు-నేడు అంటూ హడావిడి చేయడం తప్ప అభివృద్ధి ఏమాత్రం లేదన్నారు. ప్రజల్లోకి వచ్చినందుకు నాపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని వివరించారు. వైసీపీ నేతలు నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిదని అన్నారు. ముఖ్యంగా కొడాలి నాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని... నోరు జారితే చెప్పుతో సమాధానం చెబుతారని అన్నారు. 






పోలీసుల తీరుపై టీడీపీ నేతల తీవ్ర విమర్శలు


నిన్నటికి పోలీసులు లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ పాదయాత్ర, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేశారని... ఎవరినీ ఏ ముఖ్యమంత్రి అడ్డంకులు పెట్టలేదు. కానీ లోకేష్ పాదయాత్రకు ఎందుకింత భయపడి కండీషన్లు పెడుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పాదయాత్రకు ముందే అన్ని అనుమతులు తీసుకున్నాం. కానీ ఏదోవిధంగా అడ్డుకోవాలని పోలీసులు సాకులు వెతుక్కొంటున్నారని అంటున్నారు. ఎవరి పాదయాత్రకూ లేని విధంగా లోకేష్ పాదయాత్రకు 39 నిబంధనలు పెట్టారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ జోడోయాత్రకు ఎలాంటి నిబంధనలూ పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టే ల కుట్ర రాజకీయాలు అర్థమవుతున్నాయంటున్నారు. పాదయాత్రను ఏదోవిధంగా అడ్డుకునేందుకు పోలీసులతో ప్రభుత్వం కుట్రలు చేయిస్తోందన్నారు.