Tim Cook on Apple Layoffs:
అది చివరి ఆప్షన్ మాత్రమే..
మెటా,గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, అమెజాన్...ఇలా అన్ని కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. విడతల వారీగా వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్‌లో యాపిల్ (Apple Layoffs) కూడా చేరిపోనుంది. ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే యాపిల్ కూడా త్వరలోనే లేఆఫ్‌లు మొదలు పెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే...టిమ్ కుక్ మాత్రం లేఆఫ్‌లు "మా చివరి ఆప్షన్ మాత్రమే" అని తేల్చి చెప్పారు. అంటే..తప్పనిసరి పరిస్థితులు వస్తే ఉద్యోగులను ఇంటికి పంపే ఆలోచనలోనే ఉన్నట్టు పరోక్షంగా చెప్పారు. రెవెన్యూ గ్రోత్ లేని కారణంగా లేఆఫ్‌లు తప్పక పోవచ్చని, కానీ దీన్ని చివరి ఆప్షన్‌గానే పెట్టుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పడిపోవడం వల్ల బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు టిమ్‌కుక్. అందుకే..కొత్త రిక్రూట్‌మెంట్‌లు కూడా నిలిపివేసినట్టు ప్రకటించారు. కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతానికైతే లేఆఫ్‌ల గురించి క్లారిటీ ఇవ్వలేనని స్పష్టం చేశారు టిమ్ కుక్.
లేఆఫ్‌లు తక్కువే..
అయితే..గత నెలలో యాపిల్ కూడా లేఆఫ్‌లు మొదలు పెట్టింది. కాకపోతే...ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. కార్పొరేట్ రిటైల్ డివిజన్‌లో కొంతమందిని తొలగించింది. నిజానికి కొవిడ్ సంక్షోభ సమయంలో మిగతా బడా కంపెనీలన్నీ పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్ చేశాయి. ఆ సమయంలో రిక్రూట్ చేసుకున్న వారినే ఇప్పుడు తొలగిస్తోంది. కానీ...యాపిల్ మాత్రం ఆ క్రైసిస్‌లోనూ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోలేదు. అందుకే...ఇప్పుడు లేఆఫ్‌లు చేసే అవకాశాలు తక్కువగానే ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. టిమ్ కుక్ కామెంట్స్‌తో ఆ క్లారిటీ కూడా వచ్చింది.
క్వాల్‌కమ్‌లో లేఆఫ్‌లు..
చిప్ తయారీలో అంతర్జాతీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న క్వాల్‌కమ్ కంపెనీకి కూడా కష్టాలు తప్పడం లేదు. రెవెన్యూ గ్రోత్ లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే...లేఆఫ్‌లు ప్రకటించింది. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు టెంపరరీ ఉద్యోగులనూ తొలగించేందుకు సిద్ధమవుతోంది. వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుని ఆ మేరకు కాస్ట్ కటింగ్ చేసుకోవాలని భావిస్తోంది. కేవలం కాలిఫోర్నియా క్యాంపస్‌లోనే దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించనుంది క్వాల్‌కమ్. మే 3వ తేదీన ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. అదే రోజు క్వార్టర్లీ రిజల్ట్స్‌నీ విడుదల చేయనుంది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో కనీసం 5% మేర కోత విధించేందుకు ఆ కంపెనీ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే...మొబైల్ డివిజన్‌లోనే భారీగా ఉద్యోగాల కోత ఉండనుంది. ఈ ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనే 20% మేర కోతలు తప్పేలా లేవు. కొద్ది నెలలుగా క్వాల్‌కమ్ కంపెనీ సేల్స్, రెవెన్యూ దారుణంగా పడిపోయాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని చెబుతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ డివిజన్‌లో ఎక్కువగా సవాళ్లు ఎదుర్కొంటోంది ఈ సంస్థ.
Also Read: ఇమ్రాన్‌ను మహమ్మద్ ప్రవక్తతో పోల్చాడు, చావు కొనితెచ్చుకున్నాడు - పాక్‌లో దారుణం