ప్రశ్న: మా ఇద్దరికి పెళ్లయి ఆరేళ్ళు అవుతుంది. మాకు ఒక పాప కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవలు వస్తూనే ఉన్నాయి. గొడవలు వచ్చినప్పుడు నా భార్య చాలా హింసాత్మకంగా ప్రవర్తిస్తుంది. నన్ను ఇష్టం వచ్చినట్టు తోసేయడం, కొట్టడం చేస్తుంది. నేను మాత్రం తిరిగి కొట్టలేకపోతున్నా. అలా చేస్తే  నామీద పోలీస్ కేసులు పెడుతుందని భయం. ఆమె కొట్టడం, కింద పడేలా తోసేయడం, ప్రతిదానికి గొడవ పెట్టడం, నన్నుమానసికంగా, శారీరకంగా హింసించడం భరించలేకపోతున్నాను. ఈ విషయం ఇంట్లో వాళ్లకి, స్నేహితులకు కూడా చెప్పలేకపోతున్నాను. చెబితే నన్ను చులకనగా చూస్తారని భయంగా ఉంది. ఏం చేయమంటారు?


జవాబు: భార్యాభర్తలు గొడవలు పడడం అనేది ఇంట్లో సర్వసాధారణంగా జరిగేదే. అయితే భర్తని భార్య కొట్టడం మాత్రం అన్ని ఇళ్లల్లో జరిగేది కాదు. దాదాపు భార్యాభర్తలు మౌఖికంగా అరుచుకున్నాక ఇద్దరూ తగ్గిపోతారు. ఇలా భౌతికంగా దాడులు చేసేంతవరకు వెళ్ళరు. కానీ మీ భార్య చాలా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నట్టు మీ లేఖ ద్వారా అర్థమవుతుంది. చట్టం కూడా ఆడవారికి ఎక్కువ హక్కులను ఇచ్చింది. మీ భార్య మిమ్మల్ని కొడితే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు, కానీ మీరు ఆమెను కొడితే మాత్రం ఎన్నో కేసులు మీమీద పెట్టే అవకాశం ఉంది. ఆ కేసులతో వేగలేక మీరే ఇంట్లో దెబ్బలు తింటూ మౌనంగా ఉంటున్నారు. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం కేవలం గొడవ పడినప్పుడు మాత్రమే ఆమె మీతో హింసాత్మకంగా ప్రవర్తిస్తుంది. దీన్ని బట్టి మిగతా సమయాల్లో ఆమె మీతో సాధారణంగా ఉంటున్నట్లు లెక్క. ఆమె సఖ్యంగా ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో ఆమెకు వివరంగా చెప్పండి. అలా తెలిసే ప్రవర్తిస్తోందో లేక కోపం వచ్చినప్పుడు మానసిక స్థితి మారిపోతోందో కనుక్కోండి. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారు కోపం వస్తే ఇలా హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. వారికి చిన్న విషయాలు కూడా పెద్ద విషయాల్లా కనబడి, అరవడం, ఎదుటివారిని కొట్టడం వంటివి చేస్తారు. తమలో తాము కూడా చాలా బాధపడతారు. వారికి తలనొప్పి కూడా వచ్చేస్తుంది. చిన్న శబ్ధాలను కూడా భరించలేనంతగా వారి పరిస్థితి ఉంటుంది. బయట నుంచి చూసే వారికి మాత్రం వారు ఆరోగ్యంగానే కనిపిస్తారు. 


ఆమెను అడిగి ఆమెకి ఎలాంటి మానసిక సమస్యలు లేదా సంఘర్షణలు ఉన్నాయేమో కనుక్కోండి. ఒత్తిడి వల్ల అవి ఎప్పుడైనా రావచ్చు. అలాగే ఆమె అధిక ఒత్తిడి బారిన పడినా అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా అడగండి. మీరు ఆమెకు అండగా ఉంటారని చెప్పండి. అవసరమైతే చికిత్స తీసుకుందామని, ఆ విషయం ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదని చెప్పండి. మీ సంసార జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఇదంతా చేయాలి. తప్పదు. ఇలా హింసాత్మకంగా ప్రవర్తించడం సాధారణ విషయం మాత్రం కాదు. వాటికి మందులు ఉన్నాయి. మానసిక వైద్యులను సంప్రదిస్తే వారు తగిన  మందులు సూచిస్తారు. వాటి వల్ల మెదడులో అధికంగా ప్రతిస్పందించడం తగ్గుతుంది. మీ ఇద్దరు గొడవలు వల్ల మీ పాప ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనవుతుందో అర్థం చేసుకోండి. ఆ విషయాన్ని కూడా ఆమెతో మాట్లాడండి. పాప కోసం అయినా ఆమె కోపాన్ని తగ్గించుకోమని చెప్పండి. మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి.  



Also read: మొబైల్ ఎక్కువగా మాట్లాడుతున్నారా? హైబీపీ వచ్చేస్తుంది జాగ్రత్త