భారత వైమానిక దళ అమ్ముల పొదిలో చేరేందుకు మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు కొన్ని గంటల్లోనే భారత్‌కు రానున్నాయి. గుజరాత్ జామ్ నగర్ ప్రాంతానికి ఇవి చేరుకోనున్నాయి.
ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు బయలుదేరినట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. రఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత వైమానిక శక్తి సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి.
ఈ మూడు విమానాల రాకతో మొత్తం 36 విమానాల్లో 29 భారత్‌కు వచ్చినట్లు అవుతుంది. వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తోన్న మొదటి బ్యాచ్ రఫేల్ జెట్లు ఇవే. తరువాతి బ్యాచ్ రఫేల్ జెట్లు డిసెంబర్ మొదటివారంలో వచ్చే అవకాశం ఉంది. మరో బ్యాచ్ రఫేల్ జెట్లు వచ్చే ఏడాది జనవరి 26న రానున్నాయి. చివరి 36వ రఫేల్ జెట్ అనంతరం భారత్‌కు రానుంది.
భారత్, ఫ్రాన్స్ మధ్య 36 రఫేల్ జెట్ల కోసం రూ.59వేల కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ విమానాలు భారత్‌లోని అంబాలా వాయుస్థావరంలోని గోల్డెన్ ఏరోస్, బంగాల్‌లోని హషిమారా 101 స్క్వాడ్రన్‌లోకి చేరనున్నాయి.
చైనాతో ఘర్షణ వేళ..
చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరడం మన వాయుసేన శక్తిని మరింత పెంచాయి. ఇటీవల చైనా-భారత్ మధ్య దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు సైనిక చర్చలు సాగాయి. తూర్పు లద్దాఖ్‌లో నియంత్రణ రేఖ వద్ద శాంతి నెలకొల్పేందుకు చైనా- భారత్ మధ్య ఈ 13వ విడత చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి.
అయితే చర్చల సందర్భంగా భారత్ చేసిన సూచనలు, ప్రతిపాదనలను చైనా తిరస్కరించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. కనుక చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేసింది. అయితే ఇరు దేశాలు ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు, సంయమనం పాటించాలని నిర్ణయించినట్లు ఆర్మీ పేర్కొంది.
ఇరుపక్షాలు సమస్యపై సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు భారత సైన్యం తెలిపింది. క్షేత్రస్థాయిలో స్థిరత్వం నెలకొనేలా చూడాలని అంగీకరించుకున్నట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని నిబంధనలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి చైనా కృషి చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి వేళ మరో 3 రఫేల్ జెట్లు భారత వాయుసేనలో చేరడం భారత్‌కు కలిసొచ్చే అంశమని నిపుణులు అంటున్నారు.
Also Read: Malabar Maritime Exercise Pics: చైనాకు భారత్ చెక్.. 'ఆపరేషన్ మలబార్'తో డ్రాగన్ గుండెల్లో గుబులు
Also Read: Corona Cases: గత 19 రోజులుగా 30 వేలకు దిగువనే కరోనా కేసులు
Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి