PM Modi on Election Results: నరేంద్ర మోదీ తన రాజీనామా సమర్పించే ముందు మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించారు. జూన్ 8వ తేదీన మూడోసారి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రులతో సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. గెలవడం, ఓడిపోవడం రాజకీయాల్లో అత్యంత సహజమని హితబోధ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి బీజేపీ బలం తగ్గిన క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నంబర్ గేమ్ మొదలైందని, అంతా సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పారు. పదేళ్లలో చాలా అభివృద్ధి చేశామని, భవిష్యత్‌లోనూ ఇదే కొనసాగించాలని సూచించారు. పార్టీ గెలుపు కోసం శ్రమించిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 


"రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ నంబర్‌ గేమ్‌ కొనసాగుతుంది. అందుకు అంతా సిద్ధంగా ఉండాలి. గత పదేళ్లలో మనం ఎన్నో మంచి పనులు చేశాం. అదే స్ఫూర్తిని ఇకపైనా కొనసాగించాల్సిన అవసరముంది. ప్రజల ఆకాంక్షలకు, అంచనాలకు అనుగుణంగానే మన పార్టీ విజయం సాధించింది. భవిష్యత్‌లోనూ మనం మంచి చేయాలి. పార్టీ విజయం కోసం మీరంతా చాలా కష్టపడ్డారు"


- ప్రధాని నరేంద్ర మోదీ