Five Lakhs Houses Are Set To Be Delivered: గత కొన్నేళ్లుగా స్థిరాస్తి వ్యాపారం, ముఖ్యంగా కొత్త ఇళ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి. రిజిస్ట్రేషన్లు రికార్డ్‌లు సృష్టిస్తున్నాయి. అదే ఒరవడి 2024లోనూ కొనసాగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు ఈ ఏడాది 5.3 లక్షలకు పైగా కొత్త ఇళ్లను డెలివెరీ చేస్తారని అంచనా. గత పదేళ్లలోనే ఇది పెద్ద నంబర్. కొవిడ్‌-19 సమయంలో ఆగిన ఇళ్ల నిర్మాణాలు & కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'స్వామి' ఫండ్ (SWAMIH Fund) మద్దతు ఉన్న ప్రాజెక్ట్‌లు ఈ సంవత్సరం పూర్తి కావొస్తున్నాయి. దీంతో, 5 లక్షలకు పైగా ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధం అవుతున్నాయి.


ఇళ్ల గణాంకాలు
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NAREDCO) లెక్కల ప్రకారం... గత ఏడాది దేశంలోని 7 పెద్ద నగరాల్లో 4.35 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆ కౌంట్‌ ఈ ఏడాది భారీగా పెరుగుతుందని లెక్కగట్టారు. రియల్‌ ఎస్టేట్‌ కన్సెస్టింగ్‌ కంపెనీ అనరాక్ (Anarock) డేటా ప్రకారం... 2021తో పోలిస్తే 2022లో 44% ఎక్కువ హౌసింగ్‌ యూనిట్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఏటికేడు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.


స్థిరాస్తి పరంగా దేశంలోనే అత్యధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతం నొయిడా. మహమ్మారి సమయంలో సవాళ్ల కారణంగా ఈ ప్రాంతంలో మెజారిటీ ప్రాజెక్ట్‌లు స్తంభించాయి. ఇళ్ల కోసం అడ్వాన్స్‌లు ఇచ్చిన వాళ్లు డెలివరీ కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి, హౌసింగ్ ప్రాజెక్ట్‌ల్లో గృహ నిర్మాణాలు వేగం అందుకున్నాయి. కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయి.


రెరా వచ్చాక మారిన పరిస్థితులు
స్థిరాస్తి నియంత్రణ కోసం భారత ప్రభుత్వం రెరా చట్టాన్ని (Real Estate Regulation Authority Act లేదా RERA Act) తీసుకొచ్చింది. ఇది 2017 మే 01వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రెరా చట్టంతో దేశంలో స్థిరాస్తి రంగం నియమ, నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల ఇష్టారాజ్యానికి ముకుతాడు పడింది, వినియోగదార్ల హక్కులకు భద్రత వచ్చింది.


ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం, రెరా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు, దాదాపు 1.23 లక్షల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు దేశవ్యాప్తంగా రిజిస్టర్‌ అయ్యాయి. దేశవ్యాప్తంగా 1.21 లక్షలకు పైగా వినియోగదార్ల ఫిర్యాదులకు పరిష్కారం దొరికింది. 


స్వామి ఫండ్‌ 2019లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 2023 డిసెంబర్ చివరి వరకు, స్వామి ఫండ్‌ మద్దతుతో దేశంలో దాదాపు 26,000 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 80,000 గృహ నిర్మాణాలు వచ్చే మూడేళ్లలో పూర్తవుతాయని అంచనా.


హైదరాబాద్‌లో ఏటికేడు పెరుగుతు ఇంటి రేట్లు
దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ జనం వెనక్కు తగ్గడం లేదు, ఇళ్ల కొనుగోళ్లలో పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతోంది. 2023 డిసెంబర్ త్రైమాసికంతో ‍‌(అక్టోబర్‌-డిసెంబర్‌ కాలం) పోలిస్తే, 2024 మార్చి త్రైమాసికంలో ‍‌(జనవరి-మార్చి కాలం) దేశవ్యాప్తంగా నివాస గృహాల ధరలు సగటున 10 శాతం పెరిగాయి. దిల్లీ, అహ్మదాబాద్, పుణెలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. జనవరి-మార్చి కాలంలో, హైదరాబాద్ నగరంలో ఇళ్ల రేట్లు 2 శాతం పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 9 శాతం పెరిగాయి. 


2023 జనవరి-మార్చి కాలంలో, హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర సగటున రూ. 10,410గా ఉంది. డిసెంబర్‌ త్రైమాసికంలో అది రూ. 11,083కు పెరిగింది. 2024 తొలి త్రైమాసికానికి చదరపు అడుగు సగటు ధర రూ. 11,323కు చేరింది. ఏడాదిలో చదరపు అడుగు ధర సగటున రూ. 913 పెరిగింది.


మరో ఆసక్తికర కథనం: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ నుంచి స్పెషల్‌ స్కీమ్‌ - '666 రోజుల్లో' అద్భుతమైన ఆదాయం