Bank of India Special FD Scheme: ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ ఇండియా', తన ఖాతాదార్ల కోసం మంచి కానుక తీసుకొచ్చింది. ఈ బ్యాంక్, ‘666 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్’ పథకాన్ని (Bank of India 666 Days Fixed Deposit Scheme) ప్రారంభించింది. ఈ ప్రత్యేక పథకంలో రూ.2 కోట్లకు మించకుండా డిపాజిట్ చేయవచ్చు. దీనిలో, సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్ & సూపర్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఎక్కువ రాబడి ఉంటుంది. ఈ పథకం 01 జూన్ 2024 నుంచి అమలులోకి వచ్చింది.
60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వ్యక్తులను సాధారణ పౌరులు (General Citizens) అని, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని సీనియర్ సిటిజన్‌లు (Senior Citizens) అని, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని సూపర్ సీనియర్ సిటిజన్‌లు (Super Senior Citizens) అని పిలుస్తారు.
సూపర్ సీనియర్ సిటిజన్‌లకు దాదాపు 8% వడ్డీ
బ్యాంక్ ఆఫ్ ఇండియా, '666 రోజుల ప్రత్యేక FD పథకం'పై సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.95 శాతం వడ్డీని చెల్లిస్తోంది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇదే స్కీమ్‌లో... సీనియర్ సిటిజన్ కస్టమర్లు 7.80 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. సాధారణ కస్టమర్లు 7.30 శాతం వడ్డీ ఆదాయాన్ని అందుకుంటారు.
FDపై రుణ సౌకర్యం
దగ్గరలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లి 666 రోజుల ప్రత్యేక FD పథకం కింద ఖాతా ప్రారంభించొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లలేని వాళ్లు నెట్ బ్యాంకింగ్ లేదా BOI నియో యాప్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద ఖాతాదార్లకు బ్యాంకు రుణ సౌకర్యం (Loan facility on 666 days FD scheme) కూడా అందిస్తోంది.
కొత్త FD వడ్డీ రేట్లు (Latest FD interest rates of BOI)
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రేట్లు 01 జూన్ 2024 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం... సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే వివిధ కాల వ్యవధి డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.3 శాతం మధ్య వడ్డీ రేట్లను బ్యాంక్ అందిస్తోంది.
సాధారణ పౌరులకు BOI చెల్లిస్తున్న కొత్త వడ్డీ రేట్లు
7-45 రోజులు --------- 3 శాతం
46-179 రోజులు --------- 4.50 శాతం
180-269 రోజులు --------- 5.50 శాతం
270 రోజులు- 01 సంవత్సరం --------- 5.75 శాతం
01-02 సంవత్సరాలు (666 రోజులు మినహా) --------- 6.80 శాతం
02-03 సంవత్సరాలు --------- 6.75 శాతం
03-05 సంవత్సరాలు --------- 6.50 శాతం
05-10 సంవత్సరాలు --------- 6 శాతం
సీనియర్ సిటిజన్ల FD రేట్లు
సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై (రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లు) సాధారణ పౌరుల కంటే 0.50% అదనపు వడ్డీ లభిస్తుంది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితిపై మరో 0.25% వడ్డీ సంపాదించొచ్చు. అంటే, 03 నుంచి 10 సంవత్సరాల కాల పరిమితిపై సాధారణ పౌరుల కంటే 0.75% అదనపు రాబడి ఆర్జించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: అటెన్షన్ - HDFC డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు రెండు రోజులు పని చేయవు