HDFC Bank Credit Cards And Debit Cards: దేశంలో అతి పెద్ద బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు అలెర్ట్‌. ఈ బ్యాంక్‌ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్న కోట్ల మంది వినియోగదార్లు కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దీని గురించి బ్యాంక్ తన కస్టమర్‌లను ఇప్పటికే అప్రమత్తం చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులను ఉపయోగించడంలో రెండు రోజుల పాటు సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని చెప్పింది.


ఏ సమయంలో సమస్యలు?
జూన్ 04 (మంగళవారం) అర్ధరాత్రి 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు (తెల్లవారితే బుధవారం) & జూన్ 6 (గురువారం) అర్ధరాత్రి 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు (తెల్లవారితే శుక్రవారం) HDFC బ్యాంక్ కార్డ్‌లు పని చేయవు. ఈ విషయం గురించి ఈ-మెయిల్, SMSల ద్వారా తన కస్టమర్లందరినీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అలెర్ట్‌ చేసింది. బ్యాంక్ పంపిన సందేశం ప్రకారం... HDFC క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులను ఉపయోగించి ఆ రెండు సమయాల్లో ఎలాంటి లావాదేవీలు చేయలేరు.


ఎందుకని ఈ అంతరాయం?
సాంకేతికపరమైన అప్‌డేషన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తలపెట్టింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ వ్యవస్థలను ఆ నిర్దిష్ట కాలంలో అప్‌గ్రేడ్ చేస్తుంది. దీనికోసం అన్ని కార్డులను తాత్కాలికంగా స్తంబింపజేస్తుంది. కాబట్టి, కస్టమర్లు అదే సమయంలో ఈ కార్డులను ఉపయోగించలేరు.


ఎలాంటి లావాదేవీలపై ప్రభావం ఉంటుంది?
ఈ అప్‌గ్రేడేషన్ ద్వారా ప్రభావితమయ్యే లావాదేవీల్లో... ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం ‍‌(Withdrawal of money from ATM), పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్‌లో చెల్లింపులు (Payments at Point of Sale machine), కార్డ్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు (Online transactions), నెట్‌సేఫ్‌ లావాదేవీలు (NetSafe transactions) ఉన్నాయి. కస్టమర్‌లకు ఇబ్బంది లేకుండా చూసేందుకు, కార్డులను అరుదుగా ఉపయోగించే అర్ధరాత్రి సమయాన్ని అప్‌గ్రేడేషన్ కోసం బ్యాంక్ ఎంచుకుంది.


అన్ని లావాదేవీలకు హెచ్చరికలు రావు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లు UPI ద్వారా రూ.100 లోపు ఖర్చు చేసినా, లేదా రూ.500 లోపు నగదును అందుకున్నా ఖాతాదార్ల మొబైల్‌ నంబర్లకు SMS అలెర్ట్‌ రాదు. బ్యాంక్‌ నిర్ణయం ప్రకారం... యూపీఐ ద్వారా ఎవరికైనా రూ.100 కంటే ఎక్కువ నగదు పంపినప్పుడు లేదా QR కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లించినప్పుడు; ఎవరి నుంచైనా రూ.500 మించి రిసీవ్‌ చేసుకున్నప్పుడు మాత్రమే కస్టమర్‌ ఫోన్‌కు SMS వస్తుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. చిన్న లావాదేవీల విషయంలో ఖాతాదార్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. 


బ్యాంక్‌ ఖాతాల్లో ఇ-మెయిల్‌ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కూడా కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విజ్ఞప్తి చేసింది. దీనివల్ల, ఎలాంటి పరిమితి లేకుండా అన్ని రకాల లావాదేవీలకు కస్టమర్లు ఇ-మెయిల్ ద్వారా అలెర్ట్స్‌ స్వీకరిస్తారని చెప్పింది.


మరో ఆసక్తికర కథనం: ఫలితాల దెబ్బకు భారీగా పెరిగిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి