అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు చాలా అంశాలపై తేల్చకుండానే ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో జరిగే  పరిణామాలపై మాట్లాడుతూ ఢిల్లీ వెళ్తున్నానని వచ్చాక మాట్లాడుకుందామంటూ ముగించేశారు. 


కేంద్రంలో ఆసక్తికరమైన రాజకీయం చోటు చేసుకుంది. అతి తక్కువ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. 400 సీట్లు సాధిస్తామంటూ మోడీ చేసిన ప్రచారం బెడిసి కొట్టింది. ఇండీ కూటమి మాత్రం అనూహ్యంగా పుంజుకొని ఎన్డీఏకు ధీటుగా బదులు ఇచ్చింది. 


లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 294 సీట్లు వస్తే... ఇండీ కూటమికి 234 సీట్లు వచ్చాయి. దీంతో అధికారం చేపట్టాలంటే కచ్చితంగా మిత్రుల బలంపై ఆధారా పడాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. అదే టైంలో ఇండీ కూటమి కూడా ఒకట్రెండు పార్టీలను ఒప్పించి కూటమిలో కలుపుకుంటే మాత్రం కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఆలోచనలో ఉంది. 


ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో  టీడీపీ 17 సీట్లతో రెండో స్థానంలోఉంటే తర్వాత స్థానంలో నితీష్‌కుమార్ ఉన్నారు. వాళ్లను లాక్కుంటే కచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ఇండీ కూటమి నేతలు భావిస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు కూడా ప్రారంభమైనట్టు చెప్పుకుంటున్నారు. 


ఇలాంటి చర్చలు జరుగుతున్న వేళ చంద్రబాబు రియాక్షన్ ఏంటని 24 గంటల నుంచి ఎదురు చూస్తున్న వాళ్లకు చంద్రబాబు కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్డీఏ మీటింగ్‌కు వెళ్తున్నానని చెప్పారు. ఇప్పుడు కేంద్రంలో కూటముల గురించి మాట్లాడుకునే సమయం కాదంటూనే తాను ఇలాంటి రాజకీయ పరిణామాలు చాలా చూశానని చెప్పుకొచ్చారు. వాటన్నింటిపై ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని మీడియా సమావేశాన్ని ముగించేశారు.