Southern Zonal Council  : సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం తిరువనంతపురంలో జరిగింది. తెలుగు రాష్ట్రాల తరపున ముఖ్యమంత్రులు హాజరు కాలేదు.  తెలంగాణ తరపున హోంమంత్రి మహమూద్ అలీ, ఏపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సాగిన ఈ సమావేశంలో తెలంగాణ పలు అంశాలను లేవనెత్తింది.   సమావేశపు ఎజెండాలో పేర్కొన్న అంశాలన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో అనవసర జాప్యం పట్ల తెలంగాణ  ఆందోళన వ్యక్తం చేసింది.  భారత దేశంలో, తెలంగాణ రాష్ట్రం అవతరించి ఎనిమిదేళ్ళు పైగా గడిచింది. కొత్త రాష్ట్రం ఏర్పడటం అనేది, ఉద్యోగుల విభజన, ప్రభుత్వ మరియు ఇతర సంస్థల ఆస్తులు -అప్పులకు సంబంధించిన వివిధ సమస్యలను తెరపైకి తెస్తుందని మనకి తెలుసు. ఆంధ్ర ప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడి అన్ని సమస్యల పరిష్కరించడానికి, తెలంగాణ రాష్ట్రము,  ఆంధ్రప్రదేశ్ ,  కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో శ్రద్ధగా పనిచేస్తోందని... అయితే ఇంకా వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ అభిప్రాయపడింది. 


జాతీయ GDP కి 2014-15 లో 4.1% నుండి 2021-22లో 4.9%కి మెరుగైన తోడ్పాటును తెలంగాణ అందించిందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి వినూత్న అభివృద్ధి మరియు  సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ముందుంది.నీటిపారుదల అభివృద్ధి, పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపూర్వక వ్యవస్థ TS-iPASS ప్రేవేశాపెట్టడం జరిగిందన్నారు.  నిరంతరాయంగా 24X7 నాణ్యమైన విద్యుత్‌ను అందించడం, రైతులకు పెట్టుబడి మద్దతు (రైతు బంధు) మొదలైనటువంటి అనేక కార్యక్రమాల కారణంగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా మరియు స్థిరంగా ఉండడం గమనించదగ్గ  హర్షణీయ విషయం. కోవిడ్ మహమ్మారి యొక్క ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, తెలంగాణ యొక్క GSDP ప్రస్తుత ధరల ప్రకారం 2020-21లో 1.21% సానుకూల వృద్ధిని నమోదు చేయడాన్ని బట్టి ఇది స్పష్టమవుతుందన్నారు. 



అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో కౌన్సిల్ ప్రశంసనీయమైన పని చేస్తోందని  మహబూద్ అలీ సంతృప్తి వ్యక్తం చేశారు.  పెండింగ్‌లో ఉన్న సమస్యలు  సకాలంలో పరిష్కారం కావడానికి దోహదపడుతాయని  ఆశిస్తున్నాననని,, తెలంగాణకు సంబంధించిన ప్రతి ఎజెండా అంశానికి సంబంధించి అభిప్రాయాలను రాతపూర్వకంగా సమర్పించానని.. మహమూద్ అలీ తెలిపారు.  ఐదు కౌన్సిల్‌లలో ఒకటి అయిన సదరన్ జోనల్ కౌన్సిల్, రాష్ట్రాల మధ్య సమన్వయం తో సమిష్టి చర్యకు  అవసరమయ్యే ఉమ్మడి విషయాలపై చర్చించి సిఫార్సులు చేసే అధికారాన్ని కలిగి ఉన్న చట్టబద్ధమైన సంస్థ. రాష్ట్రాల పునర్-వ్యవస్థీకరణతో సంబంధం ఉన్న లేదా ఉత్పన్నమయ్యే ఏదైనా అంశంపై చర్చించే బాధ్యత కూడా జోనల్ కౌన్సిల్‌పై ఉంది.  
  
ఈ సమావేశానికి  ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంట్‌, 7 జిల్లాల ప్యాకేజీ నిధులు, రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి సైతం ప్రస్తావించారు.పీ, తెలంగాణ మధ్య విద్యుత్‌ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.