అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలకు హక్కులు కల్పిస్తామని పైకి చెప్తున్నా చేసే పనులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఓ మహిళా పాత్రికేయురాలు పోస్ట్ చేసిన వీడియో ఇందుకు నిదర్శనం. టీవీ స్టేషన్‌లో తనను ఉద్యోగానికి అనుమతించకపోవడంపై వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఆరు సంవత్సరాలుగా షబ్నమ్ వార్తా ఛానల్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఇంటికి పరిమితం కావాల్సిన వచ్చింది.
అరాచకం..
1996-2001 మధ్య కాలంలో నడిచిన తాలిబన్ల పాలనలో మహిళల హక్కులు కాలరాశారు. విద్య, ఉద్యోగం విషయంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉండేవి. అయితే ఈ సారి మాత్రం ఇస్లామిక్ చట్టాలకు లోబడి మహిళలు చదువుకునేందుకు, పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తామని వారు ప్రకటించారు. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రతీకారం..
తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ(డీబ్ల్యూ)కు చెందిన పాత్రికేయుల కోసం వారు ఏ ఇంటిని వదలకుండా గాలిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో ఓ పాత్రికేయుడి బంధువును తాలిబన్లు కాల్చిచంపినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌లో మీడియా సిబ్బంది ప్రమాదం అంచులో ఉన్నారనడానికి ఈ ఘటనే సాక్ష్యమని ఆందోళన వ్యక్తం చేసింది.