అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్లో ధ్యానేశ్వర్ అనే రైతు. అందరు రైతుల్లాగే అతనికి కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉండేది. కానీ అందరి రైతుల్లాగే అతని వద్ద డబ్బుల్లేవు. కానీ బీజేపీ అభిమాని. మోదీ గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన రైతుకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే జన్‌ధన్‌ అకౌంట్ కూడా ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్‌తో తన స్థాయికి తగ్గ లావాదేవీలే నిర్వహిస్తున్నాడు. కానీ హఠాత్తుగా ఇటీవల రూ. 15 లక్షలు అతని అకౌంట్‌లో జమ అయ్యాయి. 


రూ. పదిహేను లక్షలు ఎవరు వేసి ఉంటారా అని ధ్యానేశ్వర్ కంగారు పడుతూండగా...  ఎప్పుడో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అన్న మాటలు గుర్తొచ్చాయి. " మిత్రోం.. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం మొత్తం వెనక్కి తెస్తాం. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. పదిహేను లక్షలు వేస్తాం " అన్న మాటలు రీసౌండ్‌లో వినిపించడంతో ధ్యానేశ్వర్‌కు లైట్ వెలిగింది. మోడీనే ఇచ్చారని సంతోషపడిపోయారు. అంత సాయం చేసిన మోడీకి కనీసం కృతజ్ఞతలు చెప్పకపోతే ఎలా..? అయితే నేరుగా వెళ్లి చెప్పలేరు కాబట్టి ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ లేఖ కూడా రాశారు. 


ఆ తర్వాత ఆ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. అతని ఇల్లు రెడీ అయిపోయింది.  అయితే మోడీ రూ. 15 లక్షలు వేశారు కదా అని రూ. ఇరవై లక్షలతో ఇల్లు కట్టుకోలేదు. రైతు కాబట్టి కాస్త తక్కువగానే ఆలోచించి.. రూ. 9 లక్షలతో ఇల్లు పూర్తి చేసుకున్నాడు. ఇక మిగిలిన ఆరు లక్షలతో ఏం చేద్దామా అని ప్రణాళికలు వేసుకుంటూ ఉన్న సమయంలో  పంచాయతీ అధికారులు అతన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారు చెప్పినది విని ధ్యానేశ్వర్‌కు మైండ్ బ్లాంక్అయింది. 


ఎందుకంటే ధ్యానేశ్వర్ అకౌంట్‌లో జమ అయిన రూ. పదిహేను లక్షలు మోడీ పంపినవి కాదట.జిల్లా పరిషత్​ నుంచి గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున ధ్యానేశ్వర్ ఖాతాలో జమ అయ్యాయి. వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని సత్వరమే తిరిగి చెల్లించాలని వారు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. దీంతో  మిగిలిన ఆరు లక్షలు ఇచ్చేసిన ధ్యానేశ్వర్. ఇంటి కోసం తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టేశానని..  కావాలంటే ఇల్లు తీసుకోమని చెబుతున్నారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజుల క్రితం బీహార్‌లోనూ ఓ వ్యక్తి ఖాతాలో ఇలాగే రాంగ్‌ డిపాజిట్ అయితే మోడీనే వేశాడని ఆయన తిరిగి ఇవ్వలేదు. జైల్లో పెట్టినా తిరిగి ఇచ్చేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.