గత మూడు రోజుల నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. నిర్దేశించిన బస్సుల్లో ఎలాంటి టికెట్ లేకుండానే తిరగ వచ్చు. అయితే నిజామాబాద్‌లో ఓ కండక్టర్ మాత్రం మహిళ నుంచి ఛార్జీ వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో మహిళ నుంచి ఓ కండక్టర్ ఛార్జీ వసూలు చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు అందింది. వెంటనే ఉన్నతస్థాయి విచారణకు ఎండీ ఆదేశించారు. అనంతరం జరిగింది తెలుసుకొని కండక్టర్ తప్పులేదని తేల్చారు.
నిజమాబాద్-బోధన్ రూట్‌లో వెళ్లే పల్లె వెలుగు బస్‌లో ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. టికెట్ తీసుకున్న వ్యక్తి మూడు టికెట్లు ఇవ్వాలని కండక్టర్‌ను కోరాడు. కండక్టర్ మూడు టికెట్లు కట్ చేసి ఇచ్చి 90 రూపాయలు తీసుకున్నారు.
కొద్దిసేపు ఆలోచించిన టికెట్ తీసుకున్న వ్యక్తి కండక్టర్ వద్దకు వచ్చి మహిళలకు ఫ్రీ కదా అని అడిగారు. ఆ విషయం ముందు చెప్పాలని... మూడు టికెట్లు అంటే ముగ్గురు పురుషులే అని టికెట్ కట్ చేశానని చెప్పుకొచ్చారు. వెంటనే జరిగిన తప్పును తెలుసుకున్న కండక్టర్ టికెట్లు తీసుకొని డబ్బులు తిరిగి ఇచ్చేశారు.
ఇది కాస్త సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కండక్టర్‌ను హోల్డ్‌లో పెట్టి పూర్తిస్థాయి విచారణ చేయాలని డిపో అధికారులను ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు చేసిన అధికారులు కండక్టర్ తప్పులేదని సమాచార లోపంతోనే జరిగిన పొరపాటుగా గుర్తించారు.
విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వివరించిన సజ్జనార్... ఏమన్నారంటే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రశాంతంగా అమలవుతోంది. ఈ సౌకర్యంపై క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ ఇప్పటికే అవగాహన కల్పించాం. క్షేత్ర స్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఈ పథకం సజావుగా అమలు అయ్యేందుకు ప్రజలందరూ సహకరించాలని సంస్థ కోరుతోంది." అని విజ్ఞప్తి చేశారు.