బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం నుంచి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శని ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.


జార్ఖండ్‌ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోకి దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని వివరించింది. నల్లగొండ జిల్లాలోని కనగల్లో 77.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈనెల 25న రాజస్థాన్‌లో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షకాలం సీజన్‌లో రాష్ట్రంలో 15 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలినినో ప్రభావం గురించి డిసెంబర్ లో అంచనా వేయవచ్చని వెల్లడించింది.


హైదరాబాద్ తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్


రాష్ట్రంలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అందువల్ల ఈ 16 జిల్లాల్లో ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం


 భారీ వర్షానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా తడిసిముద్దయ్యింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా గార్ల శివారులో ఉన్న పాకాల ఏరు పొంగి ప్రవహిస్తుండటంతో రామపురం, మద్దివంచ గ్రామాలకు అధికారులు రాకపోకలు నిలిపివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్‌ శివారు మున్నేరు వాగు కూడా ఉధృతంగా పారుతున్నది. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని పలు కాలనీలు జలమయమవ్వగా.. శివారులోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.


ములుగు జిల్లాలో నీట మునిగిన పంట పొలాలు


ఇటు ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో భారీ వర్షాలకు పంట పొలాలు, మిర్చి తోటల్లో వరద వచ్చి చేరడంతో నీట మునిగాయి. మండలంలోని బూర్గుపేటలో మారేడుకొండ మత్తడి పడటంతో రోడ్డుపై వరద నీరు నదిలా ప్రవహిస్తున్నది. ములుగు-భూపాలపల్లి ప్రధాన రహదారిపై నుంచి మత్తడి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


ములుగు జిల్లా కేంద్రంలో కుండపోత వాన పడటంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణప సముద్రం మత్తడి పడింది. అలాగే మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అప్పయ్యపల్లి, సీతారాంపురం, కొండాపురం, రంగరావుపల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.