Telangana Traffic Challans: తెలంగాణలో (Telangana) వాహనదారులకు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు అవకాశం కల్పించారు. అయితే, కొంతమంది డిసెంబర్ 26 తర్వాత కొత్తగా పడ్డ ట్రాఫిక్ చలాన్లకు కూడా రాయితీ వర్తిస్తుందని, 31న న్యూ ఇయర్ వేడుకల్లోనూ వేసిన చలాన్లపై రాయితీ ఉంటుందని భావిస్తుండగా, ట్రాఫిక్ పోలీసులు దీనిపై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 25కు ముందు పడ్డ చలాన్లకు మాత్రమే రాయితీ వరిస్తుందని, తర్వాత విధించిన చలాన్లు 100 శాతం కట్టాలని స్పష్టం చేశారు. అలాగే, డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగానూ హైదరాబాద్ పోలీసులు కఠిన ఆంక్షలు అమల్లోకి తెస్తున్నారు. ఆ రోజున రాత్రి 8 గంటల నుంచే ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. పట్టుబడిన వారికి రూ.15 వేల జరిమానాతో పాటు రెండేళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. మొదటిసారి దొరికిన వాళ్లకు గరిష్టంగా రూ.10 వేల ఫైన్ తో పాటు 6 నెలల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. ఇక, రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా సహా రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని అన్నారు. డ్రైవింగ్ లైెసెన్స్ రద్దుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు.


కఠిన నిబంధనలు


గతంలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేవారు. ఈసారి, రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తామంటున్నారు. అలాగే, ఆ రోజు రాత్రి పూట ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని, అలా చేస్తే జరిమానా విధిస్తామని క్యాబ్ డ్రైవర్లను హెచ్చరించారు. అంతే కాదు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్‌ నిరాకరించకూడదని స్పష్టం చేశారు. రూల్స్‌ మీరితే... మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కింద రూ.500 జరిమానా విధిస్తామని తెలిపారు. ఎవరైనా క్యాబ్‌ డ్రైవర్‌, రైడ్‌ రద్దు చేస్తే 9490617346కు క్యాబ్‌ నెంబర్‌, సమయం, ప్రదేశం తదితర వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.  ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. మరోవైపు, ఆ రోజున రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నగర పరిధిలోని ఫ్లై ఓవర్లతో పాటు పలు రహదారులు కూడా మూసివేయనున్నట్లు సైబరాాబాద్ పోలీసులు ప్రకటించారు. శిల్పా లేఅవుట్‌, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌ స్పేస్‌, రోడ్‌ నం.45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, సైబర్‌ టవర్స్‌, ఫోరం మాల్‌, జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్‌, బాలానగర్‌ బాబుజగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్లు కూడా మూసేస్తారు. వీటితో పాటు ఓఆర్ఆర్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేలు కూడా మూసివేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. అటు, పబ్ యజమానులకు సైతం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మైనర్లకు మద్యం ఇవ్వకూడదని, పరిమితికి మించి పాసులు జారీ చేయకూడదని స్పష్టం చేశారు. ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉందని పేర్కొన్నారు. 


Also Read: Medigadda Barrage: కాంగ్రెస్‌కు పేరు రావొద్దనే కాళేశ్వరం కట్టారు - మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన మంత్రులు