KBC Question on CM Revanth Reddy: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh bachhan) హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC) కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ప్రారంభమై 24 ఏళ్లైనా ప్రజల్లో అదే పాపులారిటీ కొనసాగుతోంది. ఇందులో పాల్గొన్న సామాన్యులు కోటీశ్వరులుగా మారారు. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో తర్వాత ప్రాంతీయ భాషల్లోకి విస్తరించింది. తెలుగులోనూ తొలుత నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు', తర్వాతి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హోస్ట్ గా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షోతో సైతం అదే క్రేజ్ కొనసాగింది. ప్రస్తుతం బిగ్ బీ అమితాబ్ 'కేబీసీ 15'వ (KBC 15th Season) సీజన్ నడుస్తోంది. కాగా, తాజాగా ఈ షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సంబంధించిన ప్రశ్నను సంధించారు. అయితే, కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు లైఫ్ లైన్ ఆప్షన్ ఉపయోగించారు.
ప్రశ్న ఏంటంటే.?
ఈ నెల 15న ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్ లో రూ.40 వేల ప్రశ్నగా 'రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.?' అని అమితాబ్ ప్రశ్నించారు. ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే, సదరు కంటెస్టెంట్ సమాధానం చెప్పలేక కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో 'ఆడియన్స్ పోల్' లైఫ్ లైన్ ఆప్షన్ తీసుకున్నారు. పోల్ తర్వాత, 80 శాతం మంది 'తెలంగాణ' అని, 11 శాతం 'ఛత్తీస్ గఢ్' అని, మిగిలిన వారు మిగతా ఆప్షన్స్ ఎంచుకున్నారు. తెలంగాణ లాక్ చేసేందుకు కంటెస్టెంట్ అంగీకరించగా, సరైన సమాధానం కావడంతో తదుపరి ప్రశ్నకు అర్హత సాధించారు. కాగా, ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మారిందని, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.