Cheating Case on Book My Show in Sun burn Event Controversy: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి నగరంలో 'సన్ బర్న్' (Sunburn) పేరిట నిర్వహించ తలపెట్టిన ఈవెంట్ వివాదంలో బుక్ మై షో (Book My Show) నిర్వాహకులపై కేసు నమోదైంది. అసలు అనుమతి ఇవ్వని ఈ కార్యక్రమానికి ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించి గట్టిగా మందలించారు. నిబంధనలు పాటించాల్సిందేనని, హద్దు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం పోలీసుల అనుమతి తప్పనిసరింగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
'సన్ బర్న్'కు అనుమతి లేదు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 'సన్ బర్న్' ఈవెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (Avinash Mahanthi) స్పష్టం చేశారు. మాదాపూర్ (Madhapur) లోని హైటెక్ సిటీ (Hitech City) సమీపంలో ఈవెంట్ నిర్వహణకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. అయితే, ఇది ఇతర నగరాల్లో జరిగే సన్ బర్న్ లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని వెల్లడించారు. మరోవైపు, ఈవెంట్ కు అనుమతి లేకున్నా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ బర్న్ ఈవెంట్ కు ఎవరు అనుమతిచ్చారని, ఆన్ లైన్ లో బుకింగ్స్ ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకులు, బుక్ మై షో ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనుమతి లేకుండా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించడంపై బుక్ మై షోతో పాటు 'సన్ బర్న్' ఈవెంట్ నిర్వాహకులపైనా ఛీటింగ్ కేసు నమోదు చేశారు.
అసలేంటీ 'సన్ బర్న్'.?
'సన్ బర్న్' అనేది భారీ సంగీత వేడుక. న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో మద్యం అనుమతి ఉంటుంది. గతంలో గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో సన్ బర్న్ ఈవెంట్స్ జరిగాయి. ఈ కార్యక్రమాల్లో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా సీఎం ఆదేశాలతో పోలీసులు వీటిపై మరింత ఫోకస్ పెట్టారు. అనుమతి లేకుండా న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
పబ్బులకు హెచ్చరికలు
నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలనుకునే వారికి ఇప్పటికే నియమ నిబంధనలు ఇప్పటికే జారీ చేశామని మాదాపూర్ అదనపు డీసీపీ నంద్యాల నరసింహ రెడ్డి తెలిపారు. ఈవెంట్స్ నిర్వహించే పబ్బులకు డ్రగ్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే అని స్పష్టం చేశారు. ఈవెంట్ కు వచ్చే వారి ఐడీ కార్డు సహా బ్యాగులు తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని చెప్పారు. సీసీ టీవీ కెమెరాలు, పార్కింగ్ ప్రదేశాలు ఉండాలని, అధిక సంఖ్యలో పాసులు జారీ చెయ్యొద్దని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Road Accident News: పొగమంచు కారణంగా తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు- వివిధ ప్రమాదాల్లో ఆరుగురు మృతి