కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం అర్థాంతరంగా ముగిసింది. తెలంగాణ అధికారులు  వాకౌట్ చేశారు.  ఐదు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు ఈ ఏడాది సగం, సగం నీటిని పంపిణీ చేయాలని కోరారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎప్పట్లాగే 70 -30 రేషియోలోనే పంపిణీ చేయాలని పట్టుబట్టారు. గతంలో ఒప్పందం జరిగింది ఒక్క ఏడాదికి కాదని శాశ్వత కేటాయింపులు జరిగే వరకూ ఆ ఒప్పందం ఉంటుందని వాదించారు. అయితే తెలంగాణ అధికారులు మాత్రం తమ వాదనకే కట్టుబడ్డారు. పాత పద్దతి ప్రకారం జలాల కేటాయింపునకు ఆమోదం తెలియచేయలేదు. 


అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి పైనా చర్చించారు.  జలవిద్యుత్‌ ఉత్పత్తిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలుమార్లు కేఆర్ఎంబీకి తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై ఫిర్యాదు చేసింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతుందని..  ప్రత్యేకంగా విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతోంది. కేఆర్ఎంబీ చైర్మన్ కూడా సాగర్, కృష్ణా డెల్టా కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్  ఎంపీ సింగ్‌ రెండు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ డిమాండ్‌ను ఏపీనే చేస్తోంది కాబట్టి ఆరాష్ట్రానికి సమస్య లేదు. కానీ తెలంగాణ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. 


తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదమే కీలకంగా మారింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంపై తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. చివరికి కేంద్రం నదీయాజమాన్య బోర్డుల్ని నోటిఫై చేయాల్సి వచ్చింది. ఈ నోటిఫై చేసిన ప్రాజెక్టుల విషయంలోనూ రెండు రాష్ట్రాలకూ సంతృప్తి లేదు. రెండు రాష్ట్రాలు వరుసగా కృష్ణా జలవివాదలకు సంబంధించి పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే మొదటగా తెలంగాణ పూర్తి స్థాయి సమావేశం కోసం పట్టుబట్టి హాజరు కాలేదు. ఈ కారణంగా పలు వాయిదాల తర్వాత భేటీ జరిగింది.  జరిగింది. బోర్డు ప్రతినిధులతో పాటు, రెండు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 


ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీరు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాల్సి ఉంది. కేఆర్ఎంబీ కేటాయించిన తర్వాతనే రెండురాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాకౌట్ నేపధ్యంలో కృష్ణా బోర్డు చైర్మన్ ఏ రాష్ట్రానికి ఎంత నీరు కేటాయిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరోసారి సమావేశం నిర్వహిస్తారా లేకపోతే తనకు ఉన్న అధికారం మేరకు పంపిణీ చేస్తారా అన్నది రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరమైన అంశంగా మారింది.