తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌కు చాలా పెద్ద కష్టం వచ్చింది. ముందూ వెనుకా చూసుకోకుండా ఇచ్చిన జీవో కారణంగా ఇప్పుడు ఆయన హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ధర్మాసనం ముందు ఆయన తప్పయిపోయిందని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు శాంతించకపోతే చాలా పెద్ద కష్టమే ఆయన ఎదుర్కోనున్నారు. 


తెలంగాణ హైకోర్టులో బుధవారం ఓ పిటిషన్‌పై విచారణ జరిగింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై దాఖలైన కోర్టు ధిక్కాక కేసుల విచారణ కోసం రూ.  58 కోట్లు మంజూరు  చేశారని.. ఇది అక్రమం అని ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. దీనికి సాక్ష్యంగా జీవో జత చేశారు. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. కోర్టు ధిక్కార పిటిషన్లపై ఖర్చుల కోసం రూ. 58 కోట్లా అని ఆశ్చర్యపోయిన హైకోర్టు ధర్మాసనం ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెడతారో చెప్పాలని పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ట్రెజరీ నిబంధనలను కూడా చెప్పాలని ఆదేశించింది.  చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌కు వ్యక్తిగతంగానూ నోటీసులు ఇచ్చింది.  తదుపరి విచారణ అక్టోబర్ ఇరవై ఏడో తేదీకి వాయిదా వేసింది.  


ఈ కేసు హైకోర్టులో విచారణ జరిగినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. కోర్టు ధిక్కార కేసులకు రూ. 58 కోట్లా  అని నోరెళ్లబెట్టారు. ప్రభుత్వ వర్గాలు కూడా అంతే అనుకున్నాయి. చివరికి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కూడా అంతే ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో తెలుసుకుని వెంటనే తర్వాతి రోజే అంటే.. గురువారమే అఫిడవిట్ వేశారు. జీవోలో పేర్కొన్న ఆ రూ. 58 కోట్లు తన పై కోర్టు ధిక్కార కేసులకు కాదని వివిధ ప్రాజెక్టుల భూనిర్వాసితులు కోర్టుల్లో వేసిన పిటిషన్లతో ఆయా కోర్టులు ఇచ్చిన ఆదేశాల మేరకు చేయాల్సిన చెల్లింపులకు కేటాయించినవని వివరణ ఇచ్చారు. ఇటీవలి కాలంలో వివిధ ప్రాజెక్టు కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదంటూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. పరిహారం చెల్లించాలని కోర్టులు ఆదేశించినా అధికారులు చెల్లించకపోవడంతో పలువురికి కోర్టు ధిక్కార నేరం కింద శిక్షలు విధించింది. ఇలాంటి చోట్ల పరిహారం చెల్లించేందుకు సీఎస్ సోమేష్ కుమార్ పేరు మీద ఆ రూ. 58 కోట్లు విడుదల చేశారు.


అయితే జీవోలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం మర్చిపోయారు. జీవోను అతి నిర్లక్ష్యంగా తయారు చేసి సీఎస్‌పై ఉన్న కోర్టు ధిక్కార కేసుల విచారణ కోసమన్నట్లుగా రిలీజ్ చేశారు. ఆ నిధుల విడుదల ఉద్దేశమేంటో స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకు రాలేకపోయామని ఆయన బాధపడ్డారు. అంతే కాదు పిటిషనర్ హైకోర్టును తప్పుదోవ  పట్టించారని కూడా వాదించారు. అయితే అసలు జీవోలో ఏముంది? ఇక్కడ ఏం చెబుతున్నారని హైకోర్టు సీఎస్‌ను ప్రశ్నించింది. చెబుతున్నట్లుగా జీవో లో లేదని స్పష్టం చేసింది.   జీవోలు కనీస పరిశీలన లేకుండా ఎలా జారీ చేస్తారని.. న్యాయశాఖ పరిశీలించదా అని ధర్మాసనం ప్రశ్నించింది.


ఫండ్స్ ను విడుదల చేయవద్దని హైకోర్టు బుధవారం నాటి విచారణలో స్పష్టం చేసింది. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి లేకపోతే నిర్వాసితులకు సాయం అందించడానికి ఇబ్బందులు ఎదురవుతాయని సీఎస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం అంశంపై తదుపరి విచారణ సోమవారం నిర్వహిస్తామని హైకోర్టు వాయిదా వేసింది. అత్యంత నిర్లక్ష్యంగా జీవో విడుదల చేయడంతో సీఎస్ కూడా కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది.