కొత్త సంవత్సర వేడుకలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో నగరంలోకి భారీగా మాదకద్రవ్యాల రాక మొదలైంది. తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తెలంగాణలో భారీగా మత్తుపదార్థాలు పట్టుకున్నారు. రాష్ట్రంలో జోరుగా ఆల్ప్రా జోలం అనే డ్రగ్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిసి నిఘా పెట్టారు. పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్ కుమార్, లింగయ్య గౌడ్ అనే వ్యక్తుల నుంచి 70 కేజీల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో గచ్చి బౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. 


ఢిల్లీ నుండి 34 కేజీల మత్తు పదార్థాలను నరసింహ తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. ఆల్ప్రా జోలం డ్రగ్ ను పలు ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ లో నరసింహ గౌడ్ పని చేస్తున్నారు. ఆ పరిచయాలతోనే ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్ లో మత్తు పదార్థాలు తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. వీటి కోసం హవాలా మార్గాన్ని ఎంచుకున్నారు.


దీంతో తెలంగాణలో ఆల్ప్రా జోలం డ్రగ్ విక్రయాలపై ఇప్పటిదాకా మొత్తం 66 కేసులు నమోదు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఆల్ప్రా జోలం డ్రగ్ ఒక్కో గ్రాము 10 వేలకు అమ్మకాలు చేస్తున్నట్లుగా డ్రగ్స్ ముఠా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటిదాకా రూ.3.14 కోట్లు విలువైన ఆల్ప్రా జోలంను DRI అధికారులు సీజ్ చేశారు.