ABP C Voter Telangana Opinion Poll :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు లభిస్తాయని ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.  రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలను గెలుచుకుంటుందని ఏబీపీ - సీ ఓటర్   ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. భారత్ రాష్ట్ర సమితి  3 నుంచి 5 సీట్లు మాత్రమే వస్తాయని  ఏబీపీ- సీ ఓటర్ అభిప్రాయపడింది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని గుర్తించారు.  బీజేపీ (BJP)కి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party)కి 38 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది.

  
వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నాటికి  షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి. ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరం మినహాయిస్తే- మూడు చోట్ల బీజేపీ, ఒక దాంట్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. దీంతో  బీజేపీ ముందంజలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. 


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికీ 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. వంటి ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ విజయానికి బాటలు వేశాయి. మొదట ఈ గ్యారంటీలను ప్రకటించింది కర్ణాటకలో. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఈ ఫార్ములా తెలంగాణలో సక్సెస్ అయింది. పార్టీకి అధికారాన్ని అప్పగించింది.ఇప్పుడా ఫార్ములా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రజాదరణను తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే లోక్ సభ ఎన్నికల నాటికి పథకాలు అమలు చేసి.. ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. 


సర్వేలు కూడా లోక్ సభ సీట్లు కాంగ్రెస్ ఎక్కువ గెలుస్తుందన్న సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెరుగుతోంది.  సీఎం రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా కూడా కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల దాకా ఆయన్నే కంటిన్యూ చేస్తారనే టాక్ నడుస్తోంది. దాంతో లోక్ సభ ఎన్నికల్లోనూ మాగ్జిమమ్ సీట్లు గెలుచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఈసారి గెలిచేవాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాలి.. అసెంబ్లీ టిక్కెట్లు నిరాకరించినవారిలో సమర్థులు ఎవరున్నారు లాంటి అంశాలను బేరీజు వేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నాటికి తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తే.. ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.



[Disclaimer: This Opinion poll was conducted by CVoter. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level.]