Tealganan News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా ఆయన భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా కాంగ్రెస్‌ సభకు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 


గురువారం కామారెడ్డిలో కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సబ్బీర్ అలీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా వచ్చారు. 


కామారెడ్డి సభకు వచ్చిన కొండల్ రెడ్డి భారీ కాన్వాయ్‌ను వెంటేసుకొని వచ్చారు. సైరన్‌ మోగిస్తూ కామారెడ్డి వరకు సాగిందీ కాన్వాయ్. దీన్ని చూసిన జనం సీఎం వస్తున్నారేమో అనుకున్నారు. కానీ అందులో ఉంది సీఎం తమ్ముడు అని తెలిసి షాక్ అయ్యారు. మధ్యలో ఓ చోట కారు ఆపిన కొండల్ రెడ్డి తన అభిమానులు స్థానిక నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
సీఎం రేవంత్ తమ్ముడిగా ఉన్న కొండల్‌ రెడ్డికి ప్రభుత్వం తరపున ఎలాంటి పదవీ ఇవ్వలేదు. ఆయనకు ప్రభుత్వ కాన్వాయ్‌ను కేటాయించే హోదా కూడా కట్టబెట్ట లేదు. కానీ ఈ స్థాయిలో కాన్వాయ్‌తో కామారెడ్డి రావడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 






కొండల్ రెడ్డి కాన్వాయ్‌పై రావడం ప్రత్యర్తులకు మంచి ఛాన్స్‌ ఇచ్చినట్టు అయింది. సీఎం రేవంత్ తమ్ముడి అధికార దుర్వినియోగం అంటూ టైటిల్స్‌తో రెచ్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన పదిరోజులు కూడా కాలేదు అప్పుడే ఇలాంటి పనులేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. 
ఇదే టైంలో కొందరు మంత్రులకు సెక్యూరిటీ తగ్గించడం కూడా వివాదాస్పదం అవుతోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు వై కేటగిరి సెక్యూరిటీ ఇవ్వడం, మాజీ మంత్రులకు సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చినట్టు భద్రత ఇవ్వడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు భద్రత కుదించి సీఎం తమ్ముడు ఎలాంటి పదవిలో లేని వ్యక్తికి ఎస్కార్ వాహనంతో సెక్యూరిటీ ఇవ్వడంపై దుమ్మెత్తి పోస్తున్నారు.