CM Revanth Reddy Tweet on New AICC Incharge: తెలంగాణకు (Telangana) కొత్త ఏఐసీసీ ఇంఛార్జీగా (AICC Incharge) నియమితులైన దీపాదాస్ మున్షీని (Deepadas Munsi) హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ట్వీట్ చేశారు. అంకితభావం, నిబద్ధతతో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన గత ఏసీసీసీ ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రేకు (Manikrao ) ధన్యవాదాలు తెలిపారు. గోవా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం భారీ మార్పులు చేపట్టింది. 11 రాష్ట్రాలకు ఇంఛార్జీలు సహా, 12 మంది ప్రధాన కార్యదర్శులను నియమించింది. ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను గోవా రాష్ట్రానికి, కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్న దీపాదాస్ మున్షీకి అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించింది.










పార్టీ వర్గాల్లో చర్చ


అయితే, ఇప్పటివరకూ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను మార్చడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తూ పార్టీని విజయపథం వైపు నడిపించారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ ఆయనే ఇంఛార్జీగా ఉంటారని అంతా భావించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామాన్ని అధిష్టానానికి చేరవేస్తూ అక్కడి నుంచే రాష్ట్ర నాయకులకు సూచనలిప్పించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని పోలింగ్ కేంద్రాలకు పార్టీ ఏజెంట్లను నియమించడం, వారికి పోలింగ్ పై శిక్షణ ఇప్పించడం చేశారు. ఎన్నికల సమయంలో గాంధీ భవన్ లో వార్ రూంను సమర్థంగా నిర్వహించి పార్టీని విజయతీరాలకు చేర్చారు.






అయితే అనూహ్యంగా పార్టీ అధిష్టానం మాణిక్ రావ్ ఠాక్రేను మార్చి ఇంతకాలం తెలంగాణకు ఏఐసీసీ పరిశీలకురాలిగా ఉన్న దీపాదాస్ మున్షీకి అదనపు బాధ్యతలు అప్పగించడం అటు పార్టీ వర్గాలు, ఇటు నేతల్లో ఆసక్తికరంగా మారింది. ఆమె ఇప్పటికే కేరళలో పార్టీ వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్నారు. ఏఐసీసీ తరఫున ఆమె గత 6 నెలలుగా హైదరాబాద్ లోనే ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై పట్టు సాధించారు. పార్టీ పరిస్థితి ఏ జిల్లాల్లో ఎలా ఉంది అనే దానిపై పూర్తి అవగాహనకు వచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఏఐసీసీ, పీసీసీ హైదరాబాద్ లో నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ, పార్టీ నేతలతో చర్చల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపాదాస్, మాజీ మంత్రి, దివంగత నేత ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణి. ఆమె గతంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. గతంలో లోక్ సభ సభ్యురాలిగా రాయ్ గంజ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.


పీసీసీ కార్యవర్గ సమావేశం వాయిదా


మరోవైపు, గాంధీ భవన్ లో ఆదివారం జరగాల్సిన పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశాన్ని జనవరి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. కలెక్టర్లతో సీఎం సమావేశం దృష్ట్యా భేటీ వాయిదా పడినట్లు వెల్లడించారు.


Also Read: Telangana News: రూ.500లకే గ్యాస్ సిలిండర్ - వారికే ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదన