Telangana CM Revanth Reddy Love Story: ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఈ పేరు ఎప్పుడూ ఓ సంచలనమే. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన ముక్కుసూటి తత్వంతో రెబల్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుని కాంగ్రెస్ (Congress) పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే 'ప్రజాదర్బార్' వంటి కార్యక్రమాలతో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించారు. అయితే, రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ అందిరికీ తెలిసిందే. ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం కొందరికే తెలుసు. చదువుకునే రోజుల్లో ఆయనకూ ఓ లవ్ స్టోరీ (Love Story) ఉంది. సినిమా ట్విస్టులను తలదన్నేలా సీఎం గారి లవ్ స్టోరీలో పెద్దలను ఒప్పించి మరీ ఆయన తాను ప్రేమించిన గీతారెడ్డిని వివాహం చేసుకున్నారు. గీతారెడ్డి దివంగత నేత జైపాల్ రెడ్డి తమ్ముడు కుమార్తె.


ఇంటర్ లవ్ స్టోరీ


రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఏబీవీపీ లీడర్ గా ఉస్మానియా వర్శిటీలో ఉద్యమాలు నిర్వహించేవారు. అలా ఇంటర్ చదివే రోజుల్లో ఆయన నాగార్జున సాగర్ వెళ్లినప్పుడు గీతారెడ్డిని తొలిసారి చూశారట. అక్కడ మొదలైన పరిచయం స్నేహంగా మారి ఆ తరువాత ప్రేమగా మారిందట. మొదట రేవంత్ రెడ్డే ప్రపోజ్ చేయగా, ఆయన వ్యక్తిత్వం, ముక్కుసూటితనం నచ్చి గీతారెడ్డి కూడా ఓకే చెప్పేశారట. అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. 


మొదట్లో వీరి ప్రేమ విషయం తెలిసిన గీతారెడ్డి నాన్న వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'వారి ప్రేమ విషయం తెలిసి నేను మొదట ఒప్పుకోలేదు. ఆ తర్వాత గీతారెడ్డిని పై చదువుల కోసం నా సోదరుడు, అప్పటి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించాను. కానీ రేవంత్ రెడ్డి వదల్లేదు. జైపాల్ రెడ్డితోనే రాయబారం నడిపి నచ్చజెప్పారు.' అని చెప్పారు. రేవంత్ లోని మొండితనం, ధైర్యం, చురుకుతనం గమనించి జైపాల్ రెడ్డి తనను ఒప్పించినట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం తనకు కూడా నచ్చడంతో తన కుమార్తె గీతారెడ్డితో పెళ్లికి ఓకే చెప్పినట్లు వివరించారు. ఇలా రేవంత్ రెడ్డి, గీతారెడ్డి పెద్దల సహకారంతో, అందరి సమక్షంలో 1992లో వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఓ కుమార్తె ఉన్నారు. 


విద్యార్థి దశ నుంచే ఉద్యమకారుడిగా ఉన్న రేవంత్ రెడ్డి 2004 నుంచి రాజకీయాల్లో వచ్చి 2006లో జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది, అనంతరం ఎమ్మెల్సీగా గెలిచారు. తర్వాత టీడీపీలో చేరి కీలక నేతగా వ్యవహరించారు. అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన విజయం వెనుక భార్య గీతారెడ్డి అడగడుగునా ఉన్నారు. అన్ని విషయాల్లోనూ భర్తకు పూర్తి సహకారం అందించి, అండగా నిలిచి గెలిపించారు.


Also Read: Free Bus Scheme in Telangana: మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు పథకాలు ప్రారంభం - 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి