CM RevanthReddy Key Orders on PrajaPalana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆదివారం సెక్రటేరియట్ లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ 'ప్రజాపాలన' (Prajapalana) కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు. అలాగే, ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి కార్యాచరణపై అధికారులతో సీఎం కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


'ప్రజాపాలన' అంటే.?


తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉంటూనే, ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా పాలన అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రోజురోజుకో సరికొత్త కార్యక్రమాల్లో పాలన సాగిస్తూ.. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 'ప్రజా వాణి' నిర్వహిస్తున్నారు. ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తొలి రోజు నుంచే విశేష స్పందన లభిస్తోంది. భూసమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం ప్రజలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ ప్రజా భవన్ కు వస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 'ప్రజా పాలన'కు శ్రీకారం చుట్టారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం, గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోనుంది. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా కసరత్తు చేస్తుంది. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా 'ప్రజా పాలన' సాగనుంది. అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారు. తొలుత పది రోజుల గ్రామస్థాయిలో నిర్వహించిన అనంతరం, అవసరమైతే మరోసారి నిర్వహణపై ఆలోచన చేసే అవకాశం ఉంది.


అందుకే 'ప్రజాపాలన'


ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే 'ప్రజా వాణి' పేరిట ప్రజా భవన్ లో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తుండగా, వాటిల్లో ఎక్కువగా భూ సమస్యలు, రెవెన్యూ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్లు వంటి అంశాలపైనే ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు ప్రయాణ భారం, టైం వేస్ట్ కాకుండా చిన్న చిన్న సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే నేరుగా అధికారులే గ్రామాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించేలా 'ప్రజా పాలన'కు శ్రీకారం చుట్టింది.


Also Read: Telangana News: దీపాదాస్ మున్షీకి హృదయపూర్వక స్వాగతం - సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్