Dil Raju On Game Changer Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి నిర్మాత దిల్ రాజు కీలక విషయాన్ని వెల్లడించారు.


వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ‘గేమ్ ఛేంజర్’ విడుదల


‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ‘సలార్’ మూవీని చూసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ విషయానికి సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.  వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. వినాయక చవితి కానుగా విడుదల చేస్తామని ప్రకటించారు. తాజా ప్రకటనతో  రామ్‌చరణ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


షూటింగ్ ప్రారంభమై ఏడాది గడుస్తున్నా!


నిజానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమాను ప్రారంభించి  చాలా రోజులు అవుతోంది. ఏడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ కొననసాగుతూనే ఉంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని  అభిమానులు ఆరా తీస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. చెర్రీ మూవీ ముందుగానే షూటింగ్ మొదలైనా, విడుదల విషయంలో మాత్రం ఎన్టీఆర్ సినిమా కంటే వెనుకబడింది. ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల అవుతోంది. తొలి భాగాన్ని ఏప్రిల్ 5, 2024లో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రామ్ చరణ్ సినిమా విషయంలో ఇప్పటికీ ఓ కచ్చితమైన క్లారిటీ రాలేదనే చెప్పుకోవచ్చు.   


పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’


మెగా హీరో రామ్‌ చరణ్‌ కెరీర్ లో 15వ చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కుతోంది.  దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించారు. పొలిటికల్‌, యాక్షన్‌ కథతో ‘గేమ్‌ ఛేంజర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ తిరునావుక్కరసు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.  షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Read Also: ‘సలార్’ మూవీలో దుమ్మురేపిన విశాల్ వదిన, శ్రియా నటనకు ప్రేక్షకులు ఫిదా అంతే!