Telangana Cabinet: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియం(LB stadium)లో ప్రజాప్రభుత్వం పేరుతో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సీఎం, మంత్రుల చేత గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilsye Soundararajan) ప్రమాణస్వీకారం చేయించారు. అశేష జనవాహిని మధ్య ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Revanth reddy), ఆ తర్వాత డిప్యూటీ సీఎం(Deputy Cm )గా మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhattivikramarka ) ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో ముగ్గురు రెడ్లకు చోటు లభించింది. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎస్సీల్లో మాల సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ పదవి లభించింది. మరో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహాకు మంత్రి లభించింది. ఎస్టీల్లో ఆదివాసీ వర్గం నుంచి సీనియర్ అయిన ధనసరి అనసూయ ఆలియాస్ సీతక్కకు కేబినెట్‌లో చోటు లభించింది. బీసీల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్, పద్మశాలి వర్గానికి చెందిన కొండా సురేఖకు చోటు దక్కింది. బ్రాహ్మాణ సామాజికవర్గం నుంచి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు.
కేబినెట్ కూర్పులో సామాజిక సమతూల్యం పాటించింది కాంగ్రెస్ పార్టీ. మంత్రివర్గంలో ఆరుగురు ఓసీలు ఉంటే...బీసీలు ఇద్దరు, ఎస్సీలు ఇద్దరు, గిరిజనులు ఒకరు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా మాల సామాజిక వర్గానికి చెందిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ఖరారయ్యారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు కేబినెట్‌లో చోటు లభించలేదు. ఈ జిల్లాల నుంచి పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ...సామాజిక సమీకరణాల భాగంగా పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేతలు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్‌స్వామి, మాజీ మంత్రి గడ్డం వినోద్, ప్రేమ్‌సాగర్‌రావు కేబినెట్‌లో చోటు ఆశించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ నుంచి గెలుపొందిన సుదర్శన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీనియర్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి...కేబినెట్‌లో అవకాశం లభిస్తుందని ఆశించారు. వీరికి కూడా అమాత్య పదవి దక్కలేదు. హైదరాబాద్‌లో ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందలేదు. ఏడుగురు బీఆర్ఎస్, మరో ఏడుగురు ఎంఐఎం, బీజేపీ తరపున ఒకరు ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా, ఎస్సీ సామాజికవర్గం నుంచి మంత్రి పదవి ఆశించిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు...స్పీకర్ పదవి దక్కింది. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను కేబినెట్ విస్తరణలో మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరో ఆరు మంత్రి పదువులు ఖాళీగా ఉన్నాయి. ఎవరెవర్ని తీసుకుంటారన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది. కేబినెట్‌లో ఖమ్మం జిల్లాకు మూడు, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు రెండేసి పదవులు దక్కాయి. మెదక్ నుంచి దామోదరకు చోటు లభించింది.