Telangana Cabinet Approval of Governor's Speech: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (RevanthReddy) అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ (Telangana Cabinet) ముగిసింది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై భేటీలో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సమావేశంలో కీలకంగా చర్చించారు. ప్రస్తుత తెలంగాణ, రాబోయే రోజుల్లో తెలంగాణ ఎలా ఉండబోతుందో అనే అంశాలే ప్రధానంగా గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని ప్రభుత్వం అమలు చేసింది. మిగిలిన 4 గ్యారెంటీల అమలుపైనా మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం. 


MCRHRDలో సీఎం క్యాంపు కార్యాలయం


మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్ లోని ఆఫీస్ కార్యాలయాన్ని కూడా వినియోగించుకుంటామన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామని, కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలన్నింటినీ సమర్థంగా ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. 'బీఏసీ సమావేశం శుక్రవారం ఉంటుంది. శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటాం. పాత అసెంబ్లీ భవనంలోనే కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనంలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తాం. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతుంది.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Also Read: KCR discharge : శుక్రవారం ఆస్పత్రి నుంచి ఇంటికి కేసీఆర్ - పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం !