Chandra Babu Naidu Prasanth Kishore Meeting: ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వణుకు పుట్టించే చలిలోనే సెగలు రేగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. వ్యతిరేకత ఉన్న మంత్రులకు నియోజకవర్గాలను మార్చేశారు. టికెట్లు దక్కని నేతలు పార్టీ గెలుపు కోసం పని చేయాలని జగన్ సూచించారు. ఇలాంటి సమయంలోనే రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తోనూ చర్చలు జరిపారు. ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ భేటీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య పంచ్ డైలాగ్స్ పేలుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నాయకులు యుద్దానికి దిగారు. కోడికత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య ప్రశాంత్ కిశోర్ ప్లాన్ అని, ఇప్పుడు ఆ పీకేనే ఇంటికి తెచ్చుకున్నారు’ అంటూ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పోస్టు చేశారు.
దీనికి మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. బాబాయ్ హత్య, కోడికత్తి వెనక వ్యూహం జగన్‌దేనని అంగీకరించినందుకు ధన్యవాదాలు కోడిగుడ్డు మంత్రి గారూ’ అంటూ సెటైర్లు వేశారు.
అంబటి రాంబాబు పోస్టుకు మాజీమంత్రి జవహర్ కౌంటర్ ఇచ్చారు. నిజమే మీ దగ్గర మెటీరియల్ లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.