TANA funds misuse: అమెరికాలో జరిగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సభలు ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలను తీసుకెళ్లి అక్కడ ప్రదర్శనలు ఇప్పించడం దగ్గర నుంచి ప్రత్యేక అతిథులుగా సత్కరించడం వరకూ చాలా చేస్తూంటారు. ఈ తానా కార్యవర్గం ఇప్పుడు తప్పుదోవ పట్టింది. అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థల్లో ఒకటిగా ఉన్న TANAలో సుమారు 30 కోట్ల రూపాయల స్కాం జరిగింది.
కోశాధికారే అసలు స్కామర్ !
కోశాధికారిగా ఉన్న పోలవరపు శ్రీకాంత్ తానా ఖాతాల్లోని నగదును తన కంపెనీ అకౌంట్‌లోకి మళ్లించుకున్నారు. సెప్టెంబర్ 15 2022 - ఫిబ్రవరి 27 2024 మధ్య కాలంలో 3.04 మిలియన్ డాలర్ల TANA ఫౌండేషన్ నిధులని సొంత కంపెనీ అకౌంట్‌లోకి తరలించుకున్నారు. తానాలో కోశాధికారిగా ఉన్న ఆయన తన అధికారాల్ని ఇతర సభ్యులుతనపై ఉంచిన నమ్మకాన్ని ఇలా స్కాం చేయడానికి అనుకూలంగా మలచుకున్నారు. తానా బోర్డు సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో సమన్లు పంపగా ఈ రోజు నేరాన్ని అంగీకరించారు పోలవరపు శ్రీకాంత్. మొత్తం విషయం బయటపడేసిరికి.. అంగీకరించారు. ఈ మొత్తాన్ని తన సొంత కంపెనీ ఖాతాలోకి ఆయన నిస్సంకోచంగా మళ్లించుకున్న వైనం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.
తానా ఖాతా నుంచి తన కంపెనీ ఖాతాలోకి మళ్లించుకున్న నాలుగు మిలియన్ డాలర్లను డిసెంబర్ 15 2024 లోపు తిరిగి TANA ఖాతా లోకి జమ చేస్తానని ఒప్పంద పత్రం రాసిచ్చారు.అయితే నేరం మొత్తం పోలవరపు శ్రీకాంత్ తన పై వేసుకునన్నప్పటికీ.. ఇలా ఒక్కడే నగదు బదిలీ చేయడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. కోశాధికారి అయినంత మాత్రాన ఆయన ఒక్కరు సంతకం పెడితే పని పూర్తి కాదు. ఇతర కార్యవర్గం హస్తం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎవరెవరు కలిసి ఈ స్కాం చేశారో బయటపెట్టాలని పోలవరపు శ్రీకాంత్ పై బోర్డు సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు.
Also Read: నాడు అనంతబాబు నేడు శ్రీకాంత్- హత్య కేసులో బెయిల్‌పై విడుదలైనప్పుడు చేస్తున్న హంగామాపై విమర్శలు
నాలుగు మిలియన్ డాలర్లును ఒకే సారి తన సంస్థ అకౌంట్‌కు పోలవరపు శ్రీకాంత్ బదిలీ చేసుకోలేదు. గత రెండేళ్లుగా ఈ బదిలీ జరుగుతోంది. మరి రెండేళ్ల పాటు లెక్కలు ఎవరికీ తెలియదా..తెలిసినా అంతా సైలెంట్ గా ఉంటున్నారా అన్నది బయటకు రావాల్సి ఉంది. నార్త్ అమెరికా తెలుగువారికి అండగా ఉంటుందన్నది ఉద్దేశంతో అనేక మంది తానాకు విరాళాలు ఇస్తూంటారు. ఇలాంటి వారందర్నీ ప్రస్తుత కార్యవర్గం మోసం చేసినట్లయింది. పదవుల కోసం ,అధికారం కోసం తమ సమయాన్ని మొత్తం వృధా చేసే TANA నాయకత్వం అసమర్థత, అవినీతి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్న అసంతృప్తి సభ్యుల్లో కనిపిస్తోంది.