Konaseema News: వాలంటీర్‌ జానుపల్లి దుర్గాప్రసాద్‌ను హత్యచేయించారన్న అభియోగాలపై రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ బెయిల్‌పై విడుదల అయ్యారు. అయినవిల్లి గ్రామానికి చెందిన జానుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో ప్రధాన నిందితునిగా శ్రీకాంత్‌ను గత నెల 20న మధురైలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. 22న అమలాపురం కోర్టులో హాజరు పరిచారు. కోర్డు రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. 35 రోజులు ఆయన సెంట్రల్‌ జైలలో ఉండగా అమలాపురం రెండో అదనపు జడ్జి వి.నరేష్‌ బెయిల్‌ మంజూరు చేశారు. కొన్ని షరతలు విధించారు. 


ప్రతీ మంగళవారం, శుక్రవారం అయినవిల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. రెండో నిందితుడు వడ్డి ధర్మేష్‌కు ఇంకా బెయిల్‌ రాకపోగా తాజాగా పోలీసులు మూడో నిందితునిగా జానీ అనే వ్యక్తి పేరును చేర్చారు. జానీ ప్రస్తుతం పరారీలోగా ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. అతను దొరికితే మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..


సెంట్రల్‌ జైలు వద్ద హంగామా.. 
బెయిల్‌పై విడుదలైనప్పుడు శ్రీకాంత్‌ అనుచరులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ వద్ద హంగామా సృష్టించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శ్రీకాంత్‌ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి రావులపాలెం వరకు ర్యాలీగా తీసుకువచ్చారు. సెంట్రల్‌ జైలు వద్దకు ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు, రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌ పిల్లి సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం రూరల్‌ వైసీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్‌ వచ్చి శ్రీకాంత్‌ను కలిశారు. 


వాలంటీర్‌ హత్యకేసులో ఆరోపణలు..
మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌కు అనుచరులుగా ఉన్న వాలంటీర్‌ జానుపల్లి దుర్గాస్రసాద్‌ రెండున్నరేళ్ల క్రింత హత్యకు గురయ్యాడు. గౌతమీ నదీ తీరంలో అయినవిల్లి వద్ద దుర్గాప్రసాద్‌ మృతదేహం లభ్యమైంది. తొలుత అదృశ్యం కేసు నమోదు కాగా మృతదేహం లభ్యం అయ్యాక పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా హత్య కేసుగా నమోదు చేశారు. 


అప్పటి నుంచి ఈ కేసు పెండిరగ్‌లో ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈకేసుపై దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పి.గన్నవరం పోలీసులు కొత్తపేట డీఎస్పీ ఆధ్వర్యంలో పినిపే శ్రీకాంత్‌ను మధురైలో అరెస్ట్‌చేశారు. ఆ తరువాత నాలుగు రోజులు కస్టడీలో విచారించిన క్రమంలో కోర్టుకు హాజరు పరచగా కోర్డు రిమాండ్‌ విధించింది. తాజాగా బెయల్‌ మంజూరు కావడంతో విడుదల అయ్యాడు. అయితే మృతుడు దుర్గాప్రసాద్‌ భార్య మాత్రం తన భర్తను హత్య చేసినవారు ఎంతటివారైనా శిక్షపడాలని డిమాండ్‌ చేశారు. 


అనంతబాబు విషయంలోనూ విమర్శలు..
దళిత డ్రైవరు హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా పెద్దఎత్తున ర్యాలీ చేపట్టడం విమర్శలు పాలైంది. ఒక నిందితుడు జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చే సందర్భంలో పూల దండలు, ర్యాలీలు చేపట్టి తీసుకెళ్లడం వైసీపీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఓ దళిత వాలంటీర్‌ హత్య కేసులో కూడా రిమాండ్‌ నుంచి బెయిల్‌పై విడుదలైన పినిపే శ్రీకాంత్‌ను పూలదండలు, ర్యాలీలతో తీసుకురావడం విమర్శల పాలైంది. 


Also Read: పిక్నిక్‌ల కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బెస్ట్‌ బీచ్‌లు ఇవే