East Godavari Beaches: వింటర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కడెక్కడో విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వాళ్లు విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తంటారు. మరికొందరు లోకల్‌గానే మంచి పర్యాటక ప్రాంతాలను సెర్చ్ చేస్తుంటారు. అలాంటి వారికి మంచి టూరిజం స్పాట్‌లు ఇక్కడ చూడొచ్చు.
కార్తీక మాసంలో పర్యాటకులు విహార యాత్రకు బీచ్‌లు క్యూ కడుతుంటారు. వనసమారాధన కోసం ప్రసిద్ధి చెందిన పర్యాటక స్థలాను ఎంపిక చేసుకుంటుంటారు. ఆధ్మాత్మికంతోపాటు ఆహ్లాదాన్ని పంచే సాగర తీరాన్ని మరింత మంది ఎక్కువగా ఎంచుకుంటారు. ఆటవిడుపుగా పిల్లా పాపలతో ఆడిపాడుందుకు అనువైన ప్రాంతంగా సముద్రతీర ప్రాంతాలు ఉండడంతో ఎక్కువ శాతం మంది సాగరతీరంలో ఆటవిడుపుగా సేద తీరేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎక్కడ అనువుగా ఉండే బీచ్‌లు చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం కార్తీక మాసం పూర్తి అవుతున్నా... వింటర్‌లో వెళ్లేందుకు అనుకూలమైన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఉన్న సముద్ర తీరాలు మీకోసం
పేరుపాలెం బీచ్
పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఉండే పేరుపాలెం బీచ్ కుటుంబ సమేతంగా ఆటవిడుపుగా సాగర తీరంలో సేదతీరడంతోపాటు సరదాగా గడపడానికి మంచి అనువైన ప్రాంతం. పేరుపాలెం బీచ్‌కు చేరుకునేందుకు చాలా మార్గాలు ఉండగా అటు నర్సాపురం, ఇటు భీమవరం పట్టణాలకు పేరుపాలెం బీచ్ అత్యంత సమీపంలో ఉంటుంది. నర్సాపురం నుంచి కేవలం 14 కిలోమీటర్లు దూరం కాగా భీమవరం నుంచి 28 కిలోమీటర్లు దూరం ఉంటుంది. నేరుగా బీచ్ వద్దకు వాహనాలు వెళ్లేలా రోడ్డు సదుపాయం ఉండడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలుండవు. బీచ్‌కు ఆనుకుని కొబ్బరితోటలు, సరుగుడు తోటలు మంచి అనుభూతిని ఇస్తాయి. అదే విధంగా పేరుపాలెంలోనే ఆర్సీఎం చర్చి ఇక్కడ మంచి ఫేమస్ కూడా. తక్కువ దూరంలోనే భీమవరం, నర్సాపురం పట్టణాలు ఉండడంతో అవసరమైతే స్టే చేసేందుకు రిసార్ట్స్‌లు, ప్రయివేటు హోటళ్లు ఉంటాయి..
అంతర్వేది బీచ్..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అంతర్వేది ప్రాంతం ప్రసిద్ధి చెందిన ఆధ్మాతిక ప్రాంతం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్.. టెంపుల్‌కు అత్యంత సమీపంలోనే అంతర్వేది బీచ్‌తోపాటు వశిష్టా నదీ సాగర సంగమం కూడా ఇక్కడే ఉండడం ఇంకో విశేషం. అందుకే ఈ ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులు తరలివస్తుంటారు. అంతర్వేది వెళ్లేందుకు అటు నర్సాపురం నుంచి కానీ పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి చాలా సులభం. రోడ్డు మార్గం ద్వారా నర్సాపురం నుంచి అంతర్వేది వెళ్లాలంటే 51 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తే అంతర్వేది చేరుకోవచ్చు. ఇటు అమలాపురం నుంచి అంతర్వేది మరింత సులభం. అమలాపురం నుంచి అంతర్వేదికి 49 కిలోమీటర్లు దూరం కాగా ఎటువైపు నుంచి అయినా రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రాత్రివేళ స్టే చేసేందుకు అంతర్వేదిలో కాటేజ్‌లు అందుబాటులో ఉంటాయి. లేదా దగ్గర్లోనే ఉన్న దిండి రిసార్ట్స్ కానీ, మలికిపురం, రాజోలు, జగ్గన్నపేట, అమలాపురం ప్రాంతాల్లో ప్రైవేటు హోటళ్లులో స్టే చేయవచ్చు..
ఓడలరేవు బీచ్..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అల్లవరం మండలంలోకి వచ్చే ఓడలరేవు బీచ్ కూడా చాలా ప్రత్యేకం. ఇక్కడ ఆహ్లాదంగా గడిపేందుకు చాలా బాగుంటుంది. బీచ్‌ను ఆనుకుని సరుగుడు తోటలు, సమీపంలోనే ఓఎన్జీసీ ఫ్లాంట్లు ఆకట్టుకుంటాయి.. అమలాపురం నుంచి ఓడలరేవుకు రోడ్డు మార్గం ద్వారా 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఓడలరేవు బీచ్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ రాత్రి పూట స్టే చేసేందుకు ఓడలరేవులోనే సముద్ర రిసార్ట్స్ కూడా ఉంది.. లేదా అమలాపురంలో ప్రయివేటు హోటళ్లలో ఉండవచ్చు. ఓడలరేవును ఆనుకునే కొమరగిరిపట్నం గ్రామం ఉండడం ఈప్రాంతంలో కూడా దట్టమైన సరుగుడు తోటలు విస్తరించి ఉండడం వల్ల కొత్త అనుభూతి కలుగుతుంది.
పుదుచ్చేరీ యానాం బీచ్..
పుదుచ్చేరీ యానాంలో బీచ్‌లో మంచి అనుభూతి కలుగుతుంది.. ఇటు అమలాపురం నుంచి కానీ అటు కాకినాడ ద్వారా యానాం చేరుకోవచ్చు.. లేదా అటు ద్రాక్షారం నుంచి కూడా యానాం చాలా సులభంగా చేరుకోవచ్చు. ఎటుచూసినా కేవలం 30 కిలోమీటర్లు దూరంలోనే యానాం బీచ్ ఉండడంతో ఈప్రాంతానికి సందర్శకులు పోటెత్తుతుంటారు. పైగా వృద్ధగౌతమి నదిని ఆనుకుని ఉన్న రివర్ బీచ్ కూడా ఇక్కడే ఉండడంతో మరింత మంది యానాం వైపుకు వెళ్లేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు.. నిలువెత్తు జీసస్ విగ్రహం, ఐఫిల్ టవర్ ఇలా యానాంలో చాలా విశేషాలు కనిపిస్తాయి.. కాకినాడ నుంచి 31.7 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 31 కిలోమీటర్లు, రామచంద్రపురం నుంచి 25 కిలోమీటర్లు దూరంలోఎ ఉండే ఈయానాం బీచ్‌కు బస్సులు, ప్రయివేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
Also Read: మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే
కాకినాడ బీచ్‌లో అన్నీ విశేషాలే..
కాకినాడ బీచ్ కూడా సందర్శకులకు చాలా ఆటవిడుపుగా ఉంటుంది.. సువిశాల సాగరతీరం ఇక్కడ సొంతం కాగా తీరంలో పార్కు, శిల్పారామం, ఎగ్జిబిషన్‌లో ఉంచిన యుద్ధ విమానం, గ్లాస్ బ్రిడ్స్ ఇలా చాలా ప్రత్యేకతలు ఆకర్షిస్తాయి.. ఆదివారం ఈ బీచ్‌లో సందర్శకులు పెత్త ఎత్తున పోటెత్తుతుంటారు. కాకినాడ బీచ్ రోడ్డు మీదాగ ప్రయాణం చేస్తే బీచ్ అందాలు మనలను కనువిందు చేస్తుంటాయి.. కాకినాడ సర్పవరం నుంచి బీచ్‌కు చేరుకునేందుకు కేవలం 8 కిలోమీటర్లు దూరం మాత్రమే కాగా ఈ బీచ్‌లో ఆటవిడుపుగా పిల్లా పాపలతో గడిపేందుకు పర్యాటకులు ఆసక్తిని కనపరుస్తుంటారు..
సినిమా షూటింగ్‌లకు నెలవు ఉప్పాడ బీచ్..
సినిమాల్లో ఉద్వేగభరిత సన్నివేశాలు చిత్రీకరణ జరపాలంటే ఉప్పాడ బీచ్ చాలా ప్రత్యేకమనే చెప్పాలి.. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు కోతకు గురికాకుండా ఏర్పాటు చేసిన బండరాళ్లను తాకుతున్న దృశ్యాలు ఇక్కడ ప్రత్యేకం.. అయితే ఈ బీచ్‌లో ప్రమాదాలు ఎక్కువే.. తీరం వెంబడి సుమారు 28 కిలోమీటర్లు మేర బండరాళ్లు అమరికతో ఈ తీరం ఉంటుంది.. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు సుమారు 28 కిలోమీటర్లు మేర ఈబీచ్ రోడ్డు ఉండగా ఇక్కడికి సందర్శకులు తరలివస్తుంటారు.. అయితే పోలీసులు గస్తీ కూడా బాగానే ఉంటుంది.. సెల్ఫీలు తీసుకునే వారు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. కాకినాడ నుంచి 28 కిలోమీటర్లు దూరంలో కాకినాడ`ఉప్పాడ బీచ్ రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.. లేదా పిఠాపురం నుంచి ఉప్పాడ మీదుగా కూడా చేరుకోవచ్చు.
Also Read: హైదరాబాద్ టూ ఊటీ, కూనూర్.. రౌండ్ ట్రిప్ బడ్జెట్ 8k, డిటైల్స్ ఇవే