Afghanisthan Women Banned: 


యూనివర్సిటీ విద్య కుదరదు: తాలిబన్లు


అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన మొదలై ఏడాది దాటిపోయింది. ఈ సంవత్సరం కాలంలో ఆ దేశాన్ని సర్వనాశనం చేశారు. కఠిన ఆంక్షలతో పౌరుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ సమస్యలకు తోడు మహిళలనే లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు విపరీత ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే...వాళ్ల చదువులపైనా తుపాకీ గురి పెడుతున్నారు. మహిళలు యూనివర్సిటీ విద్య అభ్యసించడంపై నిషేధం విధించారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ అమెరికా సహా ఐక్యరాజ్య సమితి దేశాలు మండి పడుతున్నా...తాలిబన్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. "మేమేమీ అంత అరాచకవాదులం కాదు.  ఎలా పాలించాలో తెలుసు" అంటూనే అప్ఘనిస్థాన్‌లు హస్తగతం చేసుకున్న తాలిబన్లు...అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళల వస్త్రధారణపై ఇప్పటికే ఆంక్షలు విధించగా...ఇప్పుడు వాళ్ల చదువులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. "ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయండి. యూనివర్సిటీల్లో మహిళలు ఎవరున్నా వారిని సస్పెండ్ చేయండి" అని ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహమ్మద్ నదీం...అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీలకు నోటీసులు పంపారు. 


అమెరికా ఆగ్రహం..


ఈ నిర్ణయంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "అఫ్ఘనిస్థాన్ ప్రజల హక్కులను గౌరవించకుండా...తాలిబన్లు అంతర్జాతీయ సమ్మతిని కోరడం ఏమాత్రం సరికాదు. ఈ నిర్ణయం పరిణామాలనుతప్పకుండా అనుభవించాల్సి వస్తుంది" అని తేల్చి చెప్పింది. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలను వెనక్కి నెట్టి ఎక్కువ కాలం మనుగడ సాగించలేరని మండి పడింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ ఆంటోనియో కూడా తీవ్రంగా స్పందించారు. "మహిళలకు విద్యను దూరం చేయడం అంటే...కేవలం వాళ్ల హక్కుల్ని అణిచివేయడం మాత్రమే కాదు...దేశాన్నీ వెనక్కి నెడుతున్నట్టు లెక్క" అని గుటెరస్ మండి పడినట్టు ఓ ప్రతినిధి వెల్లడించారు. వేలాది మంది మహిళలు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు రాశారు. వాళ్లంతా సీట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో చాలా మంది టీచర్లుగా, వైద్యులుగా సేవలందించాలని ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో వాళ్ల కలల్ని తుడిచి పెట్టేసింది..తాలిబన్లు తీసుకున్న నిర్ణయం. నిజానికి తాలిబన్లు అధికారంలోకి వచ్చాక..యూనివర్సిటీలు అన్నీ ఇష్టం ఉన్నా లేకపోయినా...ఇలాంటి నిర్ణయాలను అమలు చేయాల్సి వస్తోంది. యువతీ యువకులకు ప్రత్యేక తరగతి గదులు ఏర్పాటు చేయడం, వేరువేరు ఎంట్రెన్స్‌లు పెట్టడం లాంటివి అమల్లోకి వచ్చాయి. యువతులకు కేవలం మహిళలే పాఠాలు చెప్పాలని ఆర్డర్లు జారీ చేశారు. సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్‌ను అభ్యసించే వీల్లేకుండా ఇప్పటికే చాలా మందిపై నిషేధం విధించారు. "మాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నేనే కాదు నా తోటి స్నేహితులు కూడా మౌనంగా ఉండిపోయారు" అని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. "మా కలల్ని పాతి పెట్టేశారు. మా భవిష్యత్ ఏంటో ఏమీ అర్థం కావట్లేదు" అని మరో యువతి కన్నీళ్లు పెట్టుకుంది. దేశమంతా మళ్లీ
చీకటి రోజుల్లోకి వెళ్లిపోతోందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: China Covid Cases: చైనాలో కరోనా బీభత్సం- ఆంక్షలు ఎత్తేయడంతో ఒమిక్రాన్ పంజా!