Maldives Minister Mariyam Shiuna: సస్పెన్షన్‌కి గురైన మాల్దీవ్స్ మంత్రి ఇటీవల సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని కించపరుస్తూ ఆమె చేసిన పోస్ట్‌ పెద్ద దుమారం రేపింది. తీవ్ర విమర్శలు రావడం వల్ల ఆమె క్షమాపణలు చెప్పారు. అయితే...ఆమె ప్రతిపక్ష పార్టీ Maldivian Democratic Party (MDP)ని విమర్శిస్తూ పోస్ట్ చేసినప్పటికీ అందులో అశోక చక్రం ఉండడం వల్ల భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్, మాల్దీవ్స్ మధ్య ఇప్పటికే విభేదాలు ముదిరిన నేపథ్యంలో ఆమె ఈ పోస్ట్ పెట్టడం అలజడి సృష్టించింది. భారతదేశ త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని ఆమె కించపరిచారంటూ కొందరు తీవ్రంగా మండి పడ్డారు. ఫలితంగా ఆమె వెంటనే ఆ పోస్ట్‌ని డిలీట్ చేశారు మరియం షియునా (Mariyam Shiuna). మరియంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. ఆ ట్వీట్స్‌కి మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయిజూని ట్యాగ్ చేశారు. ఇది గమనించిన ఆమె ఆ పోస్ట్‌ని తొలగించక తప్పలేదు. 


"ఇటీవల నేను సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదమైందని తెలిసింది. ఇలా పోస్ట్ చేసి కొందరి మనోభావాల్ని దెబ్బ తీసినందుకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ నేనో ఫొటో పెట్టాను. అది అనుకోకుండా భారతదేశ త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని పోలి ఉందని తెలిసింది. ఇది కావాలని చేసింది కాదు. అయినా సరే ఇలా అపార్థం చేసుకునేలా పోస్ట్ చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాను. భారత్‌తో మైత్రిని కొనసాగించేందుకు మాల్దీవ్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వాళ్ల అభిప్రాయాల్ని గౌరవిస్తుంది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను"


- మరియం షియునా, మాల్దీవ్స్ మాజీ మంత్రి



భారత్‌ని దూరం పెడుతూ చైనాకి దగ్గరవుతున్నారు మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయిజూ. మాల్దీవ్స్‌లో ఉన్న 80 మంది భారత సైనికులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని తేల్చి చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహమ్మద్ ముయిజూ చైనా వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమది చిన్న దేశం అయినంత మాత్రాన, కవ్వించడానికి ప్రయత్నిస్తే ఊరుకోం అంటూ పరోక్షంగా భారత్‌కి హెచ్చరికలు చేశారు. ఇప్పటికే కొంత మంది సీనియర్ నేతలు ముయిజూని మందలించారు. భారత్‌తో కయ్యం పెట్టుకోవద్దని సూచించారు. కానీ...ముయిజూ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. 


ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడి పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేశారు. సముద్ర తీరంలో గడిపారు. స్నోర్క్‌లింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సమయంలోనే మాల్దీవ్స్ మంత్రులు కొందరు మోదీపై విమర్శలు చేశారు. ఫలితంగా...పలువురు ప్రముఖులు మాల్దీవ్స్‌ ట్రిప్‌ని రద్దు చేసుకున్నారు. బాయ్‌కాట్‌ మాల్దీవ్స్ హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. అప్పటి నుంచి మాల్దీవ్స్‌కి వెళ్తున్న భారతీయుల సంఖ్య తగ్గిపోయింది. మోదీ పర్యటన తరవాత లక్షద్వీప్‌కి వెళ్లేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.