SC on Ministers: భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటనపై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సమష్టి బాధ్యత సూత్రం వర్తింపజేసినప్పటికీ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమని చెప్పింది. ఇదే సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించినవి మినహా.. వారి వాక్ స్వాతంత్ర్యంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్ లో కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సామూహిక అత్యాచార కేసుపై అప్పట్లో ఆ రాష్ట్ర మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. 4:1 మెజార్టీతో ఈ విధమైన తీర్పు వెలువరించింది. 


ఆరోగ్యవంతమైన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యం


పౌరుల హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని పేర్కొంటూ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. అయితే నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేమని.. ఈ సమస్యలు పార్లమెంట్ పరిష్కారం చూపాలని ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. నేతలు చేసే విద్వేష పూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం స్వేచ్ఛ, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని వివరించారు. సమాజంలో ప్రతీ ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఆరోగ్యవంతమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని జస్టిస్ నాగరత్న తెలిపారు


మంత్రిపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్..


యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో 2016 జూలై నెలలో ఓ సామూహిక అత్యాచారం కేసు నమోదు అయింది. తన భార్య, కుమార్తెపై జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన కేసును దిల్లీకి బదిలీ చేయాలంటూ యూపీకి చెందిన వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అంతే కాకుండా ఈ ఘటనను రాజకీయ కుట్రగా పేర్కొంటూ అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజమ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. తొలుత దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. 2017 అక్టోబర్ లో రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. నవంబర్ 15వ తేదీన ఈ కేసు విచారణ పూర్తి చేసిన జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ నాగరత్నలతో కూడి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.