Indus Water Treaty : పహల్గామ్ దాడి కారణంగా సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు ఇండియా ప్రకటించింది. అయితే ఇది చూడటానికి సాధరణ ఒప్పందంలా కనిపించినా ప్రభావం మాత్రం అణుబాంబు కంటే ఎక్కువే అని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అణుబాంబు పేల్చితే అది ప్రాణ, ఆస్థి, పర్యావరణ నష్టాన్ని కలిగిస్తుంది. బాంబు పడ్డ ప్రాంతం నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రాణ నష్టం జరుగుతుంది. భూమి, నీరు, వాయు కాలుష్యం జరిగి కొన్ని తరాల వరకు ఆ ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇండియా పేల్చిన వాటర్ బాంబ్ వెంటనే ప్రభావం చూపకున్నా దాని ప్రభావం పాక్ అంతటా మెల్లమెల్లగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. 2016లో పాక్ టెర్రరిస్టుల ఉరి దాడి తర్వాత ప్రధాని మోదీ రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు అని నర్మగర్భంగా చెప్పిన మాట ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది.
వాటర్ బాంబ్ పేలితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది. పాకిస్థాన్ పరిస్థితి ప్రతి రోజూ ఏ దేశం ఆదుకుంటుందా అని ఎదురు చూడాల్సి ఉంది. ఇప్పుడు సింధు జలాలను నిలిపివేస్తే పాక్‌పై పడే ప్రభావం అంతాఇంతా కాదు. పాకిస్థాన్‌లో తీవ్రమైన ఆర్థి, వ్యవసాయ, రాజకీయ, సామాజిక సంక్షోభం రావచ్చు. సింధు, జీలం, చీనాబ్ నదుల నీరే పాకిస్థాన్‌లోని 90 శాతం వ్యవసాయ భూములకు ఆధారం. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రాంతాలకు ఈ నీరే ప్రాణాధారం అని చెప్పాలి. ఇండియా ఈ నీటిని అడ్డగిస్తే పాకిస్థాన్‌లో గోధుమ, బియ్యం, చెరకు, పత్తి పంటల ఉత్పత్తి పడిపోతుంది. ఒక రకంగా ఈ వాటర్ బాంబ్ పేలితే పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం తలెత్తుతుంది. ఆ దేశ జీడీపికి వ్యవసాయ రంగం నుంచి 20 శాతం ఆదాయం వస్తుంది. ఈ రంగంలో 40 శాతం పాక్ ప్రజలు ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. నీటిబాంబు పేలితే ఇక 40 శాతం ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. జీడీపీలో 20 శాతం ఆదాయం కోత పడితే ఆర్థిక సంక్షోభమే తలెత్తుతుంది.
ఇప్పటికే ఐ.ఎం.ఎఫ్ నుంచి అప్పుల కోసం తంటాలు పడుతున్న పాక్ కు ఇది మూలిగే నక్కపై తాటి పండు పడినట్లే. అంతే కాదు సింధు జలాలు ఆగిపోతే పాక్‌లోని నదీ కాలువలు, నీటి పారుదల వ్యవస్థలన్నీ ప్రభావితం అవుతాయి. చెరువులు నిండుకుంటాయి. చివరకు తాగు నీటి కొరత ఏర్పడవచ్చు. భూగర్భ జలాలపై ఆధారపడటం వల్ల అవీ తగ్గిపోయి నీటి సంక్షోభం తలెత్తుతుంది.
కరవు, ఇతర సంక్షోభాలకు తెర లేపనున్న వాటర్ బాంబ్ వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల పాక్‌లో గ్రామీణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఆర్థిక, ఆహార, నీటి సంక్షోభాల వల్ల ధరలు పెరుగుతాయి. గ్రామాల నుంచి నగరాలకు ప్రజల వలసలు పెరుగుతాయి. ఇది పాక్‌లోని నగరాలపై ప్రభావం చూపుతుంది. జనాభా ఎక్కువడం, ఆకలి, పేదరికం వల్ల నగరాల్లో శాంతిభద్రతలు తలెత్తవచ్చు. సంపన్నులపై దాడులు జరగవచ్చు. పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాలు తలెత్తుతాయి. ఆకలి వల్ల నేరాలు పెరిగి పోతాయి. ఇలా సామాజిక అస్థిరత ఏర్పడుతుంది. మానవ సంక్షోభం తలెత్తుతుంది. పాక్ ప్రభుత్వంపై ఇవి తీవ్ర ఒత్తిడి కలుగజేస్తాయనడంలో సందేహం లేదు.
విద్యుత్ కొరతకు ఆజ్యం సింధు జలాలను ఇండియా అడ్డుకుంటే ఆ ప్రభావం పాక్‌లోని విద్యుత్ రంగంపై చూపుతుంది. పాకిస్థాన్ విద్యుత్ రంగం ఆధారపడేదే ఇండస్ వాటర్‌పైన. దీనిపై ఆధారపడే పాక్ హైడల్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. తర్బెలా డ్యామ్ తీసుకున్నా, మంగ్లా డ్యామ్ తీసుకున్నా వీటి నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్‌కు సింధు జలాలే కారణం. ఈ ప్రవాహాన్ని ఇండియా అడ్డుకుంటే పాకిస్థాన్‌లో విద్యుత్ కొరత తీవ్ర ప్రభావాన్నిచూపుతుంది. దీని వల్ల పాకిస్థాన్ పారిశ్రామికరంగం మూతపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా టెక్స్ టైల్ పరిశ్రమలు దెబ్బతింటాయి. పారిశ్రామిక రంగం దెబ్బ కంటే, ఆ ఎఫెక్ట్ పాక్ ఎగుమతులపై పడుతుంది. విదేశీ ఆదాయం ఆగిపోతుంది. ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థతో కుంటుతున్న పాకిస్థాన్ బోర్లా బొక్క పడాల్సిందే.
ఆర్థికంగా పాక్ ను ముంచనున్న ఇండియా ఈ కారణాలన్నీ పాకిస్థాన్‌ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బకొట్టే విషయాలు. ఒక్కవాటర్ బాంబు ప్రయోగం పాకిస్థాన్‌లోని అన్ని రంగాలపై తీవ్రప్రభావం చూపిస్తోంది. పాకిస్థాన్ దేశం వ్యవసాయం, పరిశ్రమలపై ఆధారపడే దేశం. సేవల రంగంలో వారి పాత్ర శూన్యం. అలాంటిది ఈ రెండు రంగాలు నడిచేది నీటితోనే. 2019 నివేదికల ప్రకారం పాకిస్థాన్ నీటి కొరత వల్ల తన జీడిపీలో నాలుగు నుంచి ఆరు శాతం ఆదాయం తగ్గిపోయినట్లు చెబుతున్నాయి. ఇక ఇండియా వాటర్ బాంబు పేలితే పాక్ సంగతి అంతే.
ఆర్థిక నష్టం జీడీపీ గ్రాఫ్‌ను కింద పడేస్తుందనడంలో సందేహం లేదు. పాక్‌కు విదేశీ మారక ద్రవ్యం వచ్చేది కూడా వ్యవసాయ ఉత్పత్తుల వల్లే. బియ్యం, పత్తి ఉత్పత్తి పడిపోతే ఎగుమతులు తగ్గుతాయ. దీంతో ఆ దేశ ద్రవ్య నిల్వలు అడుగంటడం ఖాయం. ఇదే జరిగితే ఆహార సంక్షోభం తగ్గించడానికి దిగుమతులపై ఆధారపడాలి అందుకు విదేశీ మారక ద్రవ్యం అవసరం. అప్పులు కట్టాల్సి ఉంది. దానికి విదేశీ మారక ద్రవ్యం అవసరం, ఇంధన దిగుమతికి అవసరం. ఇవన్నీ చెల్లించలేని పరిస్థితుల్లోకి పాక్ వెళ్లిపోయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవాల్సిందే.
పర్యావరణం, సమాజంపైన ప్రభావంఇండియా ప్రయోగించే ఈ వాటర్ బాంబ్ పాక్‌లోని పర్యావరణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. నీటిపారుదల వ్యవస్థ దెబ్బతిని ఆ దేశం భూగర్భజలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా నీటిని తోడిస్తే దీర్ఘకాలికంగా పాకిస్థాన్ నీటి సంక్షోభంలో కూరుకుపోతుంది. దీని ప్రభావం నుంచి అంత త్వరగా బయటపడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆహర కొరత ఏర్పడుతుంది. నదులు, చెరువు, కుంటలు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది మత్స్యరంగంపైన ప్రభావం చూపుతుంది. కరవు పరిస్థితుల వల్ల పశు సంపద ఇతర జీవజాలంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరవు పరిస్థితుల వల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశాలు లేకపోలేదు. నిరనసలు, హింస తలెత్తవచ్చు. ఆయిల్ సంక్షోభం తలెత్తి శ్రీలంకలో చూసిన పరిస్థితులు పాక్‌లో ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ పాకిస్థాన్‌లో అంతర్గత సంఘర్షణలకు దారి తీయవచ్చు.