Pahalgam Attack: భారత్‌, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఓ జవాన్ పాకిస్థాన్‌కు చిక్కాడు. పంజాబ్ సరిహద్దును అనుకోకుండా దాటిన భారత సరిహద్దు భద్రతా దళ (BSF) జవాన్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, ఆ జవాన్ విడుదల కోసం రెండు దేశాల ఆర్మీ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 23, 2025) ఫిరోజ్‌పూర్ సరిహద్దు అవతల నుంచి 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ రేంజర్లు BSF జవాన్‌లు ఎలా పట్టుకున్నారు?ఆ జవాన్ యూనిఫాంలో ఉన్నాడని, సర్వీస్ రైఫిల్ కూడా ఉందని అధికారి చెప్పారు. BSF జవాన్ రైతులతో ఉన్నాడని, ఓ చోట విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడని, ఆ తర్వాత అతను పాకిస్తాన్ రేంజర్ల చేతిలో చిక్కినట్టు చెప్పారు. BSF జవాన్ విడుదల కోసం రెండు దేశాల దళాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు అసాధారణం కాదని, ఇంతకు ముందు రెండు వైపుల మధ్య ఇలాంటి ఘటనలు జరిగాయని అధికారి తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి వేళ ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారతదేశం అనేక చర్యలు తీసుకుందని అధికారి తెలిపారు.

ఒకరిపై ఒకరు చర్యలు

మంగళవారం (ఏప్రిల్ 22, 2025) జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారతదేశం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సహా ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం ఈ కఠినమైన నిర్ణయాలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 24, 2025) జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు.

NSC సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంది. వాఘా సరిహద్దుమూసివేస్తున్నట్లు భారత్‌ ప్రకటించినందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా వాఘా సరిహద్దు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ దేశం విడిచి వెళ్లాలని భారత్‌ ఆదేశించడంతో తమ దేశంలో ఉన్న భారతీయులందరూ ఏప్రిల్ 30 నాటికి దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం నీటిని ఆపివేస్తే, దానిని యుద్ధంగా పరిగణిస్తామని పాకిస్తాన్ తెలిపింది.

పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలు

భారతదేశంతో పాకిస్తాన్ ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా తక్షణమే నిలిపివేసింది. 

పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది.

పాకిస్తాన్ వాఘా సరిహద్దు మూసివేసింది.

పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసింది

ఏప్రిల్ 30 నాటికి భారతీయులందరూ దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది.

సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇది 24 కోట్ల మంది పాకిస్తానీయులకు జీవనాధారమని చెప్పింది. భయపడిన భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపించింది. భారత్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్రిక్తతను పెంచుతుందని శాంతి స్థాపనకు ఆటంకం కలిగిస్తుందని పాక్ PMO విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

సింధు జల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన అంతర్జాతీయ ఒప్పందం అని, ఏకపక్షంగా నిలిపివేయడానికి నిబంధన లేదని పాకిస్తాన్ తెలిపింది. ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ పేరుతో పాకిస్తాన్ సార్వభౌమాధికారం,  భద్రతకు ముప్పు ఉంటే గట్టిగా స్పందిస్తామంది.

వేరే దేశాలకు లేదా అక్కడి నుంచి భారతదేశానికి వచ్చే విమానాలు తమ భూభాగం ద్వారా వెళ్లడానికి అనుమతి లేదని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ తమ గగనతలాన్ని బ్లాక్ చేసింది. పాకిస్తాన్ భారత హైకమిషన్‌లోని సైనిక సలహాదారులను ఏప్రిల్ 30 లోపు వెళ్లిపోవాలని కోరింది.