Supreme Court on Forced religious conversion:


పిటిషన్‌పై విచారణ..


బలవంతపు మత మార్పిడిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై నిర్లక్ష్యం వహించకూడదని, ఎంతో కీలకమైన విషయమని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని...దీన్ని కట్టడి చేసే మార్గాలు చూడాలని సూచించింది. "ఈ బలవంతపు మత మార్పిడులు ఆగకపోతే భవిష్యత్‌లో చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని వ్యాఖ్యానించింది. జస్టిస్ ఎమ్‌ఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కొన్ని సూచనలు చేసింది. ఈ మత మార్పిడిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. "ఇది కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కట్టడి చేయాల్సిన అవసరముంది. ఇది జరగకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఏమేం చర్యలు తీసుకోవచ్చో సూచించండి" అని వ్యాఖ్యానించింది. జాతీయ భద్రతనూ ఇది దెబ్బకొట్టే ప్రమాదముందని మత స్వేచ్ఛకూ భంగం కలిగిస్తుందని అభిప్రాయపడింది. అందుకే..ఇలాంటి బలవంతపు మత మార్పిడులపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపించి కట్టడి చేయాలని ధర్మాసనం సూచించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు...ఈ వ్యాఖ్యలు చేసింది. "డబ్బు ఆశ చూపించి, గిఫ్ట్‌లు ఇస్తామని, 
బెదిరించి మత మార్పిడి చేయించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి" అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.


RSS నేత కామెంట్స్..


ఈ మధ్యే RSS నేత దత్తాత్రేయ హోసబేల్ మత మార్పిడి, జనాభాపై చేసిన కామెంట్స్ చేశారు. "ప్రపంచవ్యాప్తంగా మత మార్పిడి పెరిగి పోతోంది. అందుకే..హిందువుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీనికి పరిణామాలు మనమంతా అనుభవిస్తున్నాం. మతమార్పిడి అనేది పెద్ద కుట్ర. కావాలనే కొందరు టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోని ఈశాన్య ప్రాంతాల్లోకి కొందరు అక్రమంగా చొరబడుతున్నారు. ఇది కూడా మన జనాభాపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికి ఈ చొరబాటుని అడ్డుకునే చర్యలు చేపడుతున్నా..మిగతా రాష్ట్రాల్లోనూ ఇది కనిపిస్తోంది. బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో సామాజికంగా సమస్యలు  తలెత్తుతున్నాయి" అని వ్యాఖ్యానించారు దత్తాత్రేయ. మతమార్పిడిపై దృష్టి సారించి 
"anti-conversion" చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. నాలుగు రోజుల ఆల్‌ ఇండియా RSS మీటింగ్‌లో పాల్గొన్న ఆయన...ఈ కామెంట్స్ చేశారు. మత మార్పిడిని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను RSS ఎప్పటి నుంచో చేస్తోందని గుర్తు చేశారు. "Ghar Wapsi" ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, చాలా మంది మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశారని చెప్పారు. ఇస్లాం, క్రిస్టియానిటీ లోకి మారిన వాళ్లు మళ్లీ హిందువులుగా మారిపోతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం మత మార్పిడిని నియంత్రించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరముందని అన్నారు దత్తాత్రేయ. వివాహం పేరుతో బలవంతంగా మతం మార్చటాన్ని నియంత్రిస్తూ యూపీ సర్కార్ చట్టం తీసుకురావటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యారు. 


Also Read: Tata Airlines Merger: ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం, ఏడాదిలో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం!