Bihar Caste Census: బీహార్‌లో నిర్వహిస్తున్న కుల గణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా దీన్ని పేర్కొన్న ధర్మాసనం.. హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. కావాలంటే హైకోర్టులో పిటిషన్ వేయవచ్చని కూడా పిటిషనర్‌కు తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు మూడు పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఈ పిటిషన్లు 'ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్' అనే స్వచ్ఛంద సంస్థ, బీహార్‌లోని నలందా నివాసి అఖిలేష్ కుమార్, హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా నుంచి ఈ పిటిషన్‌లు వచ్చాయి. జనాభా గణన చట్టం ప్రకారం జనాభా లెక్కలు నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
కుల గణననకు సంబంధించిన అంశం ఇప్పటికే పాట్నా హైకోర్టుకు వెళ్లగా.. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టి వేసింది. దీన్ని సీఎం నితీష్ కూమార్ కూడా స్వాగతించారు. కావాలనే కొందరు దీన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా వెల్లడించారు. కానీ అది గుర్తించిన ధర్నాసనం పిటిషన్ ను కొట్టి వేసిందని చెప్పుకొచ్చారు.
జనాభా గణన జరగకపోతే.. రిజర్వేషన్ అమలెలా సాధ్యం..!
కులానికి ఎంత రిజర్వేషన్లు మంజూరు చేయాలనే అంశంపై తామెలా ఆదేశాలు జారీ చేయగలమని జస్టిస్ గవాయ్ అన్నారు. క్షమించండి.. మేము అలాంటి ఆదేశాలు జారీ చేయలేమని, పిటిషన్లను కూడా స్వీకరించలేమని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. హైకోర్టుకు బదులు సుప్రీం కోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ గవాయ్ సూచించారు. అలాగే రాష్ట్రంలో సరైన కుల గణన, జనాభా గణన జరగకపోతే.. రాష్ట్రం ప్రభుత్వం రిజర్వేషన్ వంటి విధానాన్ని ఎలా సరిగ్గా అమలు చేయగలదని ప్రశ్నించారు.
పిటిషన్‌లో ఏం ఉందంటే?
భారత రాజ్యాంగం జాతి, కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించిందని.. కుల, జాతి వైషమ్యాలను తొలగించడానికి... రాష్ట్రం రాజ్యాంగపరమైన బాధ్యతలో ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించే హక్కును భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందా అని కూడా పిటిషన్ లో ప్రశ్నించారు. అంతేకాకుండా మరికొన్ని అంశాలను కూడా లేవనెత్తారు.
- కుల గణనను నిర్వహించేందుకు బిహార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుందా?
- భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి కుల గణన చేసే హక్కును కల్పించిందా?
- జూన్ 6న బిహార్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ జారీ చేసిన నోటిఫికేషన్ జనగణన చట్టం 1948కి విరుద్ధమా?
- చట్టం లేనప్పుడు కుల గణన నోటిఫికేషన్ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా?
- కుల గణన నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయా?
- కుల గణనపై రాజకీయ పార్టీల నిర్ణయం బిహార్ ప్రభుత్వానికి కట్టుబడి ఉందా?
- జూన్ 6న బిహార్ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ అభిరామ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయానికి విరుద్ధమా? అంటూ పిటిషన్లలో ప్రశ్నించారు.