SC on BBC Ban:
బుట్టదాఖలు..
భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హిందూ సేన ఈ పిటిషన్ వేయగా దీనిపై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుంద్రేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను బుట్టదాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఇలాంటి సెన్సార్‌షిప్‌ను చేయలేదని తేల్చి చెప్పింది. ఇదే
"ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే పిటిషన్. అసలు ఇలా ఎలా వాదిస్తారు. పూర్తిగా ఆ ఛానల్‌పై సెన్సార్ విధించాలా? ఇదేం పిటిషన్"
-సుప్రీం కోర్టు
డాక్యుమెంటరీ వివాదం..
‘India: The Modi Question’ పేరిట బీబీసీ చేసిన డాక్యుమెంటరీ కొంత కాలంగా వివాదాస్పదమవుతోంది. గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్రం బ్యాన్ విధించింది. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఈ వీడియో క్లిప్‌లు కనిపించకుండా సెన్సార్ విధించింది. ఈ క్రమంలోనే హిందూ సేన అసలు బీబీసీ ఛానల్‌నే సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చివరకు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. జాతి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నా రంటూ హిందూసేన తన పిటిషన్‌లో పేర్కొంది. కేవలం ప్రధాని చరిష్మాకు మచ్చ తెచ్చేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే BBC దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని పిటిషన్‌లో ప్రస్తావించింది హిందూ సేన. ఇప్పటికే కేంద్రహోం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని హిందూసేన తెలిపింది.
గుజరాత్ అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవలే విచారించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కేంద్రం సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏప్రిల్‌కు విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుంద్రేశ్‌తో కూడా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. అడ్వకేట్ ఎమ్ ఎల్ శర్మతో పాటు సీనియరన్ జర్నలిస్ట్ ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, అడ్వకేట్ ప్రశాంత భూషణ్...సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఎన్నో నిజాలున్నాయని, వాటిని వెలుగులోకి తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఎక్కడా ఈ వీడియోలు లేకుండా చేయడాన్నీ సవాలు చేశారు.