UP Viral News: పెళ్లంటే నూరేళ్ల పంట. దాన్ని సంబురంగా జరుపుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. తమ తమ తాహతను బట్టి చిన్నగా, పెద్దగా వివాహ కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే కొందరు బంధువులు మాత్రం రాబంధుల్లో ఉంటారు. అది తక్కువ అయింది, ఇది తక్కువ అయిందంటూ దెప్పిపొడుస్తూనే ఉంటారు. వివాహంలో వారికి దక్కాల్సిన మర్యాదలు దక్కకపోయినా, వారికి ఇష్టమైన భోజనం పెట్టకపోయినా నానా రచ్చ చేస్తుంటారు. ఇలాంటి ఘటనల వల్ల చాలా సార్లు పెళ్లిళ్లు కూడా ఆగిపోయాయి. అయితే ఓ వివాహ విందులో ఇలాంటి ఘనటే జరిగింది. పెళ్లిలో పనీర్ పెట్టలేదని బంధువులో గొడవ పడ్డారు. ఆపై ఇరు వర్గాల వాళ్లు బెల్టుతో కొట్టకొని హల్ చేశారు. ప్రశాంతంగా జరగాల్సిన పెళ్లిలో గొడవలు సృష్టించి నానా రచ్చ చేశారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. 


అసలేం జరిగిందంటే..? 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్ పత్ లో గురువారం ఓ వివాహం జరిగింది.. అయితే ఆ వివాహ విందులో వరుడి తరఫు బంధువు ఒకరు గొడవకు దిగారు. వివాహ విందులో పనీర్ పెట్టలేదని.. అలా పెట్టకుండా ఎలా ఉంటారని వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా పెద్ద దుమారంగా మారింది. మాటా మాటా పెరిగి ఇరు వర్గాల వాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బెల్టుతో కొట్టుకున్నారు. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకొని... దాడికి పాల్పడ్డ వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో అందరినీ విడిచి పెట్టారు. 


మూడు నెలల క్రితం హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనే


ఇస్తామన్న కట్నం సమయానికి ఇవ్వలేదనో, అబ్బాయి వేరే వాళ్లను ప్రేమించడమో లేదో అప్పటికే వధూవరులిద్దరిలో ఒకరికి పెళ్లై పిల్లలు ఉండడం వల్లనో పీటల మీద పెళ్లి ఆగిపోవడం మనం చాలా సార్లే చూసి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం వివాహ విందులో చికెన్ పెట్టకుండా.. శాఖాహారం మాత్రమే పెట్టారని వరుడి స్నేహితులు గొడవ చేశారు. ఇది చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో పెళ్లే ఆగిపోయింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


హైదరాబాద్ షాపూర్ నగర్ లో ఓ పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. జగద్గరిగుట్ట రింగ్ బస్తీకి చెంది వరుడు, కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే షాపూర్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఆడ పెళ్లి వారు బిహార్ కు చెందిన మార్వాడీ కుటుంబీకులు కావడంతో శాకాహార వంటలు చేశారు. అయితే విందు ముగింపు దశలో పెళ్లి కుమారుడి స్నేహితులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదంటూ గొడవకు దిగారు. శాఖాహారం మేం తినమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రంమలోనే ఇరుపక్షాల మధ్య గొడవ జరిగింది. 


అయితే వెంటనే పెళ్లి కుమార్తె కుటుంబీకులు జీడిమెట్ల సీఐ పవన్ ను కలిసి విషయాన్ని తెలిపారు. స్పందించిన ఆయన ఇరు కుటుంబ సభ్యులను, వధూవరులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలన్నీ మర్చిపోయిన తర్వాత రోజు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇలా కథ సుఖాంతమైంది.