Supreme Court on Hate Speech: 



రాష్ట్రాలకు ఆదేశాలు..


సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్వేష పూరిత ప్రసంగాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని తేల్చి చెప్పింది. ఎవరైనా అలాంటి ప్రసంగాలు చేసినప్పుడు FIR నమోదు కాకపోయినా...అలాంటి కేసులను సుమోటోగా స్వీకరించాలని వెల్లడించింది. మతాలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. భారత్‌లోని సెక్యులరిజాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని ఆదేశించింది. అంతే కాదు. ఇలాంటి కేసులను రిజిస్టర్ చేయడంలో ఆలస్యాన్ని సహించేదే లేదని స్పష్టం చేసింది. ఎవరైనా ఈ రూల్‌ని అతిక్రమిస్తే అది కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని అన్ని రాష్ట్రాలనూ హెచ్చరించింది. హేట్ స్పీచ్‌ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని చెప్పింది. విద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించిన పిటిషన్‌లను ఒకేసారి విచారించిన సర్వోన్నత న్యాయస్థానం...ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. విద్వేష పూరిత ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది సుప్రీంకోర్టు. గతేడాది అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి ఆర్డర్‌ పాస్ చేసింది. 






ఓ హేట్‌ స్పీచ్ కేసులో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రేకి సమన్లు జారీ కాగా...ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసింది. బొకారో కోర్టు ఈ సమన్లు జారీ చేయగా..వాటిని రద్దు చేసింది. కేవలం ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను పట్టుకుని మత విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారనడం సరికాదని తేల్చి చెప్పింది. మరో కేసులో రాజ్ థాక్రేపై సమన్లు జారీకాగా వాటినీ రద్దు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. గతేడాది అక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు ఇదే అంశంపై సీరియస్ అయింది. మతం పేరుతో విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలపై స్పందించింది. మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నామని  ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మతం పేరుతో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఏ మతానికి చెందినవారిపైనా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి ప్రసంగాలపై పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి కేసు నమోదు చేయాలని ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఎవరైనా ఫిర్యాదు చేసేంత వరకు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కరణాగ పరిగణిస్తామని తెలిపింది.  


Also Read: Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేస్తాం, సుప్రీంకోర్టుకి వెల్లడించిన పోలీసులు