Lecturer Suspended After Article 370 Hearing: ఇటీవల ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రభుత్వ లెక్చరర్‌ను ఎందుకు విధుల నుంచి తొలగించారో తెలుసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఈ విషయంపై మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని వెల్లడించింది. ఆయన సస్పెన్షన్‌కు, కోర్టులో వాదన వినిపించిన అంశంపై సంబంధం ఉందేమో తెలుసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఇది ప్రతీకార చర్యలా కనిపిస్తోందని అన్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ జహూర్ అహ్మద్ భట్ అనే సీనియర్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు లా డిగ్రీ కూడా ఉండడంతో తన పిటిషన్‌పై స్వయంగా తానే వాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆగస్టు 24 న కోర్టులో విచారణకు హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. అయితే ఇది జరిగిన మరుసటి రోజు అహ్మద్ భట్ విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్ విద్యాశాఖ ఆగస్టు 25 న ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు, జమ్ము కశ్మీర్ ఎంప్లాయి కండెక్ట్ రూల్స్, జమ్ము కశ్మీర్ లీవ్ రూల్స్ అతిక్రమించారని ఆయనను విధుల నుంచి తొలగించారు.
లెక్చరర్ విధుల నంచి సస్పెండ్ అయిన విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అహ్మద్ భట్ రెండు రోజులు సెలవు పెట్టి వచ్చి ఇక్కడ వాదనలు వినిపించారని, తిరిగి వెళ్లగానే ఆయనను సస్పెండ్ చేశారని ధర్మాసనానికి తెలిపారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి దీనిని తీవ్రంగా పరిగణించారు. వెంటనే ఆటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణితో.. 'మిస్టర్ అటార్నీ జనరల్, ఏం జరిగిందో కనుక్కోండి. ఒక వ్యక్తి ఈ కోర్టుకు వచ్చి వాదనలు వినిపించారు. ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడండి' అని ఆదేశించారు.
ఇంకేదైనా కారణం ఉంటే అది వేరే విషయం కానీ కోర్టుకు హాజరైన వెంటనే ఎందుకు సస్పెన్షన్‌కు గురయ్యారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే సస్పెన్షన్ వేరే సమస్యలకు సంబంధించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే ఇదే సమయంలో ఎందుకు అని జస్టిస్ ఎస్‌కే కౌల్ అడగడంతో ఇలా చేయడం సరైనది కాదని అంగీకరించారు. అయితే భట్ సస్పెన్షన్‌ను ముందుగానే ఆదేశించి ఉంటారని సిబల్ వెల్లడించారు. వాదనలకు హాజరవ్వడం వల్ల సస్పెండ్ చేసి ఉంటే మాత్రం కచ్చితంగా ప్రభుత్వం చర్యలు ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఇలా అయితే స్వేచ్ఛ ఏమవుతుందని ప్రశ్నించారు.