Superbugs Infection:


వణికిస్తున్న సూపర్ బగ్
 
ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా సతమతం అవుతుంటే...ఇప్పుడు మరో మహమ్మారి ప్రజల్ని బలి తీసుకునేందుకు రెడీగా ఉందంటూ బాంబు పేల్చారు సైంటిస్ట్‌లు. అమెరికాలో ఇప్పటికే ఇది వ్యాప్తి చెందుతోందన్న వార్తలు వణుకు పుట్టిస్తున్నాయి. ఆ మహమ్మారి పేరే "సూపర్ బగ్" ఈ పేరు వింటేనే ప్రపంచం ఇప్పుడు ఉలిక్కి పడుతోంది. ఈ బ్యాక్టీరియా మెడికల్ సైన్స్‌కే సవాలు విసురుతోంది. లాన్సెట్ జర్నల్ కూడా దీని గురించి ప్రస్తావించింది. ఇదే వేగంతో సూపర్ బగ్ వ్యాప్తి చెందితే...ఏటా కనీసం కోటి మంది బలి అవుతారని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ సూపర్ బగ్ కారణంగా...ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ జర్నల్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే...యాంటీ బయోటిక్స్, యాంటీ ఫంగల్ డ్రగ్స్ కూడా ఈ సూపర్‌ బగ్‌ పని పట్టలేకపోతున్నాయి. ఫలితంగా...మరో ముప్పు ముంగిట ఉన్నామా అన్న ఆందోళన మొదలైంది. 


సూపర్ బగ్ అంటే ఏంటి..? 


సూపర్ బగ్ ఓ బ్యాక్టీరియా. ఇది మనుషుల ప్రాణాల్ని తీసేస్తుంది. కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగానే..మందులు వాడినప్పటికీ ఈ బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపించదు. కొంత కాలానికి...ఇది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను సాధిస్తుంది. ఆ తరవాత ఇక ఏ వైద్యం అందించినా కష్టమే. అసలు ఈ సూపర్ బగ్స్ మన శరీరంలోకి ప్రవేశించేది...విపరీతమైన యాంటీ బయోటిక్స్ వాడడం వల్ల అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఫ్లూ లాంటి వాటికీ మితిమీరి యాంటీ బయాటిక్స్ వినియోగించడం వల్ల అవి క్రమంగా శరీరంలో సూపర్‌బగ్స్‌ని సృష్టిస్తాయి. అవే క్రమంగా శరీరమంతా వ్యాపించి ప్రాణాలు తీస్తాయి. చర్మం, సలైవా ద్వారానే కాకుండా...లైంగికంగా కలిసినప్పుడూ ఈ బ్యాక్టీరియా సులువుగా ఒకరి నుంచి ఒకరికి  వ్యాప్తి చెందుతుంది. కొవిడ్ సంక్షోభం తరవాత ప్రజలందరూ చిన్న చిన్న జబ్బులకు కూడా భయపడిపోయి యాంటీ బయాటిక్స్ విపరీతంగా వాడడం మొదలు పెట్టారని ICMR సర్వే వెల్లడించింది. సెకండ్‌ వేవ్ సమయంలో కొవిడ్ బాధితులందరికీ బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందింది. ఆ వైద్యానికీ బోలెడంత ఖర్చైంది. ఈ మందుల వినియోగం తగ్గించకపోతే భవిష్యత్‌లో పెను ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Scholar Academic Journal of Pharmacy రిపోర్ట్ ప్రకారం...గత 15 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా యాంటీ బయాటిక్స్ వినియోగం 65% మేర పెరిగింది. కొవిడ్ వస్తుందేమోనన్న
భయంతో ముందుగానే ఈ మందులు వాడుతున్న వాళ్లూ ఉన్నారు. ఇదే సూపర్‌బగ్‌ వ్యాప్తికి కారణమవుతోంది. ఈ బ్యాక్టీరియా కారణంగా అమెరికా ఓటా 5 బిలియన్ డాలర్ల మేర నష్టపోతోంది.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి..


1.సూపర్‌బగ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే తరచూ సబ్బు నీళ్లతో చేతులు కడుక్కోవాలి. 
2.హ్యాండ్ శానిటైజర్ వాడటం ఉత్తమం. 
3.ఆహార పదార్థాలను శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి. 
4.ఆహారాన్ని సరైన విధంగా వండుకోవాలి. స్వచ్ఛమైన నీరు తాగాలి. 
5.యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గించుకోవాలి. 


Also Read: COVID-19 Cases: భారత్‌లోనూ పెరుగుతున్న కరోనా కేసులు, ఆ 5 రాష్ట్రాలు అలెర్ట్