Highcourt Shock For SIT :  ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి మరో షాక్ తగిలింది. సిట్ దర్యాప్తు చెల్లదంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన  పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏసీబీ కోర్టులో బీఎల్ సంతోష్, జగ్గు స్వామి, తుషార్ చెల్లపల్లి, శ్రీనివాస్ లను నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలుచేసింది. అయితే అసలు ఈ కేసును సిట్ దర్యాప్తు చేయడం ఏమిటని.. చెల్లదని చెప్పి ఏసీబీ కోర్టు మెమోను తిరస్కరించింది. దీన్ని హైకోర్టులో సవాల్ చేశారు. వీరి పిటిషన్ ను కొట్టి వేసిన కోర్టు ..   ఏసీబి కోర్టు తీర్పు ను సమర్దించింది. 


ఇప్పటికే సీబీఐకి ఎమ్మెల్యేలకు ఎర కేసు 


ఫాం హౌస్ కేసును ఇటీవలే  హైకోర్టు సీబీైఐకి అప్పగి్తూ  హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.   కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని  సీబీఐకు ఇవ్వాలని చెప్పింది. ఫాంహౌస్ కేసులో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ లేదా ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ ద్వారా ఎంక్వైరీ చేయాలని అభ్యర్థించింది. దర్యాప్తు వివరాల లీకులపై పిటిషనర్లు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఆధారాలను లీక్ చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల తరఫున మహేశ్ జఠ్మలానీ, సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న  న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. సిట్ను క్వాష్ చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తీర్పు వెలువరించింది.


రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డీల్ 


భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) నలుగురు ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం, బిజెపికి అనుకూలంగా మారేందుకు వారిని ఆకర్షించడం వంటి పనులకు ఆ ముగ్గురు నిందితులు పాల్పడ్డారన్నది ఆరోపణ. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ అనే ఆ ముగ్గురు నిందితులు మోయినాబాద్ ఫారమ్ హౌస్‌లో ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టే, బిజెపి పార్టీలోకి ఆకర్షించే మంతనాలు జరిపారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురు ఎంఎల్‌ఏలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చేలా వారు ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆ ముగ్గురు బిజెపి ఏజెంట్లని ఆరోపణ.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక పరిశోధన బృందం(సిట్)ను నవంబర్ 9న ఏర్పాటుచేసింది. ఆ సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే హైకోర్టు కేసును సిబిఐకి బదలాయించేసింది.


ఈడీ విచారణ కూడా ప్రారంభం ! 


బీజేపీలో చేరితే వంద కోట్లు ఇస్తానని.. నందకుమార్ ప్రలోభపెట్టారని.. నంద కుమార్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే ప్రస్తుతం కేసు నడుస్తోంది. అందుకే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. అయితే అసలు ఫామ్ హౌస్ కేసులో డబ్బుల చెలామణినే లేదని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. అలాంటప్పుడు ఈడీ రాకూడదంటున్నారు. కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టులో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దీంతో ఈడీ విచారణ కొనసాగనుంది.